ఇటీవల జరిగిన సైమా-2022 అవార్డ్స్ లో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘పుష్ప‘ మూవీ ఎక్కువ అవార్డులు గెలుపొందిన విషయం తెలిసిందే. గతేడాది పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అయితే.. పుష్ప క్యారెక్టర్ తో అల్లు అర్జున్, శ్రీవల్లి క్యారెక్టర్ తో రష్మిక మందాన ఎలాగైతే పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్నారో.. పుష్పకు ఫ్రెండ్ క్యారెక్టర్ కేశవ పాత్రలో నటించిన జగదీశ్ ప్రతాప్ కూడా అంతే క్రేజ్ దక్కించుకున్నాడు. ఇక సైమా అవార్డ్స్ లో బెస్ట్ కేటగిరిలన్నీ పుష్పకే రావడంతో.. బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డును జగదీశ్ అందుకున్నాడు.
ఈ క్రమంలో సైమా అవార్డు అందుకున్న సందర్భంగా జగదీశ్ స్టేజిపై ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. అవార్డు అందుకోగానే “అమ్మా లవ్ యూ” అని కంటతడి పెట్టేసుకున్నాడు జగదీశ్. ఆ తర్వాత మాట్లాడుతూ.. తన లైఫ్ లో నటుడు అవ్వాలనే డ్రీమ్, నటుడుగా తన ప్రయాణం, సినిమాల్లోకి వెళ్తానంటే ఫ్యామిలీ సపోర్ట్.. తనను మొదటగా వెబ్ సిరీస్ తో పరిచయం చేసిన డైరెక్టర్ నుండి పుష్ప వరకు అందరిని ప్రస్తావిస్తూ థాంక్యూ చెప్పాడు జగదీశ్. పుష్ప సినిమా తనకు ఐదవ సినిమా అని.. ఈ సినిమా తర్వాతే తన లైఫ్ టర్న్ అయ్యిందని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. అలాగే అవార్డు అందుకున్న ఆనందంలో స్టేజిపై ఓ పాట కూడా పాడాడు.
ప్రస్తుతం జగదీశ్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాకోసం హీరో అల్లు అర్జున్, సుకుమార్ లతో పనిచేయడం డ్రీమ్ అని, అలాగే షూటింగ్ టైంలో అల్లు అర్జున్ ఎంకరేజ్ చేసిన విధానం గురించి కూడా చెప్పాడు. ఇక పుష్ప సినిమాలో హీరో తర్వాత ఫుల్ లెన్త్ రోల్ కేశవదే. మరి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన పుష్ప.. సైమా అవార్డ్స్ లో కూడా సత్తా చాటడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి బెస్ట్ యాక్టర్, డైరెక్టర్, బెస్ట్ ఫిలిం, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్స్(మేల్, ఫిమేల్) ఇలా ఎక్కువ అవార్డులు సొంతం చేసుకొని.. పుష్ప 2 పై అంచనాలు పెంచేసింది చిత్రబృందం. ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు నిర్మించారు.