జియా ఖాన్ బాలీవుడ్‌లో ఒక్క సినిమాతో ఒవర్ నైట్ స్టార్‌గా మారింది. అంతే త్వరగా ఆమె జీవితం ముగిసింది. ఆత్మహత్య చేసుకుని జియా ఖాన్ మృతి చెందింది. నేటికి కూడా ఆమె మరణం ఓ మిస్టరీగానే మిగిలింది. బాయ్‌ఫ్రెండ్ కారణంగానే జియా ఖాన్ ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో వచ్చిన నిశ్శబ్ద్ చిత్రం ద్వారా జియా ఖాన్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ 2013, జూన్ 3న ఆమె ఆత్మహత్య చేసుకుని అసువులు బాసింది. అయితే బాయ్‌ఫ్రెండ్ సూరజ్ పంచోలీ వేధింపుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా కోర్టు విచారణకు హాజరయిన జియా ఖాన్ తల్లి.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు..
తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా ముంబై స్పెషల్ కోర్టుకు హాజరైన జియా ఖాన్ తల్లి రబియా ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురు ఆత్మహత్యకు ముందు సూరజ్ ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించాడంటూ కోర్టులో వాంగ్మూలమిచ్చింది. ‘‘నా కుమార్తె జియా.. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో సూరజ్ సోషల్ మీడియా ద్వారా తనకు పరిచయం అయ్యాడు. నెమ్మదిగా పరిచయం పెంచుకుని.. ఆమెను కలిసేందుకు ప్రయత్నించాడు. కొంత భయం, మరికొంత అయిష్టంగానే జియా తొలిసారిగా 2012 సెప్టెంబర్‌లో అతడిని కలిసింది. అప్పుడు వాళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలు నాకు పంపింది. తామిద్దరం కేవలం ఫ్రెండ్స్ అనే చెప్పింది. ఆ తర్వాత సూరజ్ నెమ్మదిగా జియా లైఫ్‌ను తన కంట్రోల్‌లోకి తీసుకున్నాడు. తను ఎప్పుడేం చేయాలనేది కూడా సూరజే నిర్ణయించేవాడు’’ అని చెప్పుకొచ్చింది.
‘‘2012 అక్టోబర్ నుంచి వారిద్దరూ డేటింగ్ ప్రారంభించారు. వాళ్లిద్దరూ ఒకరింట్లో మరొకరు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఆ తర్వాతి నెలలో నేను లండన్‌కు వెళ్లినప్పుడు నా కూతురు చాలా సంతోషంగా కనిపించింది. క్రిస్‌మస్ పండగ జరుపుకునేందుకు, తిరిగి సినిమాల్లో నటించేందుకు ముంబై తిరిగి వస్తానంది.కానీ అలా జరగలేదు. డిసెంబర్ 24న సూరజ్ నాకు మెసేజ్ చేశాడు. జియాఖాన్ మీద కోప్పడ్డాడనని, దయచేసి తనను క్షమించి ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతూ మెసేజ్ చేశాడు. దాంతో వాళ్లిద్దరూ ఏదో పెద్ద గొడవే పెట్టుకున్నారని నాకు అప్పుడర్థమైంది. అయితే జియా అతడిని క్షమించేసింది. అనంతరం వాళ్లిద్దరూ కలిసి గోవాకు వెళ్లారు. కానీ ఓరోజు నా కూతురు నాకు ఫోన్ చేసి తనకక్కడ ఉండాలని లేదని, ఆ ప్రాంతమే తనకు అదోలా ఉందని చెప్పింది. కారణం.. గోవాలో నా కూతురి ముందే సూరజ్ మిగతా అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసేవాడు’’ అని చెప్పుకొచ్చింది రబియా.
‘‘2013, ఫిబ్రవరి 14న జియా లండన్ వచ్చేసింది. అప్పుడు నేను తనను చూసినప్పుడు.. తను ఏదో పొగొట్టుకున్నదానిలా దీనంగా కనిపించింది. ఏమైందని అడిగితే సూరజ్ తనను శారీరకంగా హింసించడమే కాకుండా, అసభ్య పదజాలంతో దూషిస్తున్నాడని, చాలా చెత్త చెత్త పేర్లతో పిలుస్తూ టార్చర్ చేస్తున్నాడని నా దగ్గర చెప్పుకుని బాధపడింది’’ అని చెప్పుకొచ్చింది రబియా ఖాన్. ప్రస్తుతం ఈ కేసును సీబీఐ విచారణ జరుపుతోంది. తుది తీర్పు ఎలా రానుందో చూడాలి. మరి రబియా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.