దర్శకుడు అంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటారు. మరి టైటానిక్ లాంటి అద్భుతాన్ని తెరకెక్కించిన దర్శకుడ్ని ఏమని అంటారు. అంత పెద్ద షిప్ బ్యాక్ డ్రాప్ తో ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించారు కాబట్టి కెప్టెన్ ఆఫ్ టైటానిక్ షిప్ అనవచ్చేమో. అంతకంటే పెద్ద టైటిల్ జేమ్స్ కామెరూన్ అనే పేరు ఉందిగా. ఈ పేరు ముందు కెప్టెన్ ఆఫ్ ద షిప్ కూడా చిన్నదే. జేమ్స్ కామెరూన్ ముందు సంచలనం అనే పదం చాలా చిన్నది. సినిమాల మీద ఆసక్తితో అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆఫీస్ అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించిన జేమ్స్.. ప్రపంచం మెచ్చుకునే దర్శకుడిగా ఎదగడం వెనుక మధ్యతరగతి జీవితం ఉంది.
జేమ్స్ కామెరూన్ కెనడాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో 1954 ఆగస్టు 6న జన్మించాడు. అక్కడే పెరిగాడు. ఈయన తండ్రి ఒక ఇంజనీర్, తల్లి గృహిణి. జేమ్స్ కి చదువంటే అస్సలు ఎక్కేది కాదు. కానీ ఫిజిక్స్ ల్యాబ్ లో ప్రయోగాలు అంటే మాత్రం పిచ్చి. ఆ పిచ్చి వల్లే స్కూల్ కి వెళ్ళేవాడు. జేమ్స్ తల్లి చిన్నప్పుడు కథలు బాగా చెప్పేది. దీంతో కామెరూన్ కి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటు కాస్తా కామెరూన్ కి సైన్స్ ఫిక్షన్ కథల మీద ఆసక్తి పెరిగేలా చేసింది. దీంతో చదువు షెడ్ కెళ్ళిపోయింది. జేమ్స్ తండ్రికేమో కొడుకుని ఇంజనీర్ గా చూడాలని కోరిక. కొడుకుని కాలేజ్ లో చేర్పిస్తే.. ఈ చదవడాలు, ప్యాసవడాలు మనవల్ల కాదేహే అని మధ్యలోనే మానేశాడు. అలా అని ఇడియట్ లా ఇంట్లో అమ్మా, నాన్నల మీద ఆధారపడి బాధ్యత లేకుండా ఉండలేదండోయ్.
అమ్మ, నాన్నలకి భారం అవ్వకూడదని ఆ పని, ఈ పని చేసేవాడు. మెషినిస్ట్ గా, ట్రక్ డ్రైవర్ గా, సెక్యూరిటీ గార్డుగా చాలా పనులు చేసేవాడు. అయితే ట్రక్ డ్రైవర్ గా పని చేయడం జేమ్స్ తల్లికి నామోషీగా ఉండేది. ట్రక్ డ్రైవర్ గా కాకుండా, వేరే ఏదైనా పని చేయమని చెప్పేది. కానీ జేమ్స్ కి డ్రైవర్ పనే నచ్చేది. నచ్చిన పని చేయడంలో ఆనందం ఉందని చెప్పాడు. డ్రైవర్ గా పని చేస్తూ.. వీలు చిక్కినప్పుడల్లా కవితలు, కథలు రాసుకునేవారు. డ్రైవింగ్ లో ఉన్నప్పుడు ఏమైనా ఆలోచనలు వస్తే.. వెంటనే ట్రక్ ను ఓ పక్కకు ఆపి రాసుకునేవారు. మిగతా డ్రైవర్లు జేమ్స్ ని విచిత్రంగా చూసేవారు. ఇలా సాగుతుండగా.. 1977లో స్టార్ వార్స్ ఫ్రాంచైజీ సినిమాలు చూసిన కామెరూన్.. తీస్తే ఇలాంటి సినిమాలు తీయాలి అని అనుకున్నాడు.
అప్పుడే డైరెక్టర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలని అనుకున్నాడు. కానీ అనుకున్న వెంటనే అయిపోతే అది విజయం ఎలా అవుతుంది. సక్సెస్ వచ్చే ముందు ఎదురుచూసే సమయంతో పాటు అవమానాల సంఖ్య కూడా పెరుగుతుంది. రెండేళ్ల ప్రయత్నాలు చేసిన తర్వాత పిరానా ప్రొడక్షన్ హౌజ్ లో పనిచేసే అవకాశం దొరికింది. దీని కంటే ముందు 1978లో అప్పు చేసి మరీ ఫ్రెండ్ తో కలిసి గ్జినోజెనెసిస్ అనే షార్ట్ ఫిల్మ్ చేశాడు. 1979లో రాక్ అండ్ రోల్ హైస్కూల్ సినిమా కోసం ప్రొడక్షన్ అసిస్టెంట్ గా పని చేశాడు. అక్కడ ఫిల్మ్ టెక్నిక్స్ నేర్చుకున్న కామెరూన్.. ఆ తర్వాత రోజర్ కార్మన్ స్టూడియోస్ లో మోడల్ మేకర్ గా చేరాడు.
అతి తక్కువ సమయంలోనే బ్యాటిల్ బియాండ్ ది స్టార్స్ అనే సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ కి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. 1981లో వచ్చిన ఎస్కేప్ ఫ్రమ్ న్యూయార్క్ సినిమాకి స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేశాడు. ఆ తర్వాత గెలాక్సీ ఆఫ్ టెర్రర్ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేశాడు. ఈ క్రమంలో కామెరూన్ కి పిరానా 2 సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఈ సినిమాతోనే కామెరూన్ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడంతో కామెరూన్ బాగా ఫీలయ్యాడు. ఎందుకంటే ఈ సినిమా కథ కామెరూన్ ది కాదు. ఎవరిదో ఎరువు కథకి.. అరువు దర్శకుడిగా పని చేయవలసి వచ్చింది.
నిజానికి ఈ సినిమాకి ముందు వేరే దర్శకుడు పని చేయాలి. అతను మధ్యలో వదిలేసి వెళ్లిపోవడంతో.. “ఇగో కామెరూన్ నువ్వేదో టాలెంట్ ఉంది, పొడుస్తాను అంటున్నావ్ కదా.. పొడిచెయ్’ అని పిరానా ప్రొడక్షన్ వాళ్ళు అవకాశం ఇచ్చారు. కథ బాగోపోతే జేమ్స్ మాత్రం ఏం చేయగలడు. అందుకే అప్పటి నుంచి సొంత కథలనే తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడు. అలా తీసిన మొదటి హిట్ సినిమా ది టెర్మినేటర్. ఇది అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పట్లో యూఎస్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కామెరూన్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. టెర్మినేటర్ 2, టైటానిక్, అవతార్ లాంటి మెగా బ్లాక్ బస్టర్స్ ని తెరకెక్కించాడు.
టెర్మినేటర్ సినిమా కథ.. తాను కన్న కల నుంచి పుట్టుకొచ్చింది. ఒకసారి పిరానా షూటింగ్ సమయంలో ఫుడ్ పాయిజన్ అయితే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నిద్రపోతున్న జేమ్స్ కి ఒక కల వచ్చింది. కలలో ఒక కంటికి కనిపించని రోబో తనపై దాడి చేసినట్లు అనిపించింది. వెంటనే దీన్ని బేస్ చేసుకుని ఒక కథ రాసుకున్నాడు. అదే ది టెర్మినేటర్ సినిమా అయ్యింది. ఈ సినిమా కామెరూన్ ని హాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ ని చేసింది. ఆ తర్వాత టైటానిక్ అనే సినిమా తీశాడు. టైటానిక్ సినిమా ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆ సినిమా వరల్డ్ కల్ట్ క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది. కామెరూన్ చిన్నప్పుడు ఆర్ట్ స్టూడెంట్. ఆ కారణంగానే టైటానిక్ చిత్రంలో పెయింటింగ్ వేయగలిగాడు.
ఇక అవతార్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించాడు. మెగా విజనరీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాతో వరల్డ్ స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్న వెంటనే అయిపోలేదు. పదేళ్ల నిరీక్షణ, అలుపెరగని ప్రయత్నం ఫలితమే ఈ సినిమా. 1999లో కథని సినిమాగా తీయాలని చాలా ప్రొడక్షన్ సంస్థలను సంప్రదించాడు. కానీ బడ్జెట్ ఎక్కువని ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కామెరూన్ తనే సొంతంగా సినిమాని నిర్మించాలనుకున్నాడు. అప్పటికే తన నిర్మాణ సంస్థ అయిన లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో టెర్మినేటర్ 2, ట్రూ లైస్, టైటానిక్, సోలారిస్ వంటి సినిమాలకి నిర్మాతగా కూడా ఉన్నాడు.
అవతార్ సినిమా కోసం బడ్జెట్ పెడదామనుకున్నా, ఈ విజనరీ సినిమాని తెరకెక్కించడం అసాధ్యం అని చాలా మంది నిర్మాతలు అనడంతో ఇక తనే స్వయంగా రంగంలోకి దిగాడు. సహ నిర్మాత జాన్ లండావ్ తో కలిసి ఈ సినిమాని నిర్మించతలపెట్టాడు. కీలక నిర్మాత కాబట్టి జేమ్స్.. ఈ సినిమా పెట్టుబడి కోసం తన ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది. బయట నుంచి కొంత అప్పు చేయాల్సి వచ్చింది. అయితే ఇంత రిస్క్ చేసినందుకు ఘన ఫలితమే దక్కింది. ఈ సినిమా ఊహించని విజయం అందుకుంది. ఇప్పుడు అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు. డిసెంబర్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తుంది.
ప్రపంచాన్నే మెస్మరైజ్ చేసిన ఈ సినీ బ్రహ్మ పక్కా శాఖాహారి. మాంసం అస్సలు ముట్టడు. అంతేనా ఈయన జంతు ప్రేమికుడు కూడా. పాలు తాగడు, పాలతో చేసినవి తాగడు, పాల పదార్థాలు అస్సలే తినడు. 2012 నుంచి మొక్కల ఆధారిత ఆహారం తినాలని నిర్ణయించుకున్నాడు. ఇక కామెరూన్ కి హిందుత్వం అన్నా, భారతీయ సంస్కృతి అన్నా ఎంతో మక్కువ. అందుకే అవతార్ టైటిల్ ని సంస్కృతం నుంచి తీసుకున్నాడు. హిందూ పురాణాల్లోని రాముడు, కృష్ణుడు, విష్ణు అవతారాల స్పూర్తితో అవతార్ అనే పేరుని పెట్టడమే కాకుండా.. అవతార్ సినిమా పాత్రలకు నీలం రంగుని ఎంచుకున్నాడు. అదన్నమాట విషయం. ట్రక్ డ్రైవర్ గా చేసి.. దర్శకత్వం చేసే స్థాయికి వచ్చి ఇవాళ ప్రపంచం మెచ్చుకునే దర్శకుడు అయ్యాడు. అదే సృజనాత్మకతకు ఉన్న స్థాయి.
ప్రతీ ఒక్కరిలోనూ జేమ్స్ కామెరూన్ లు ఉంటారు. కాకపోతే మిడిల్ క్లాస్ అనే సంకెళ్లతో.. బాధలు, కష్టాలు, సమస్యలు, కన్నీళ్లు అనే నాలుగు గోడల రూమ్ లో ఉండిపోతారు. ఆ రూమ్ దాటి వస్తే ప్రతి ఒక్కరూ కామెరూన్ లే. ఆలోచనలు ఆ రూమ్ దాటి రాగలిగితే మీరు కూడా ఒక జేమ్స్ కామెరూన్ అయిపోతారు. జేమ్స్ కామెరూన్ లా మీకు కూడా అద్భుతమైన ఆలోచనలు వస్తున్నాయా? మీకెప్పుడైనా కామెరూన్ లా ఆలోచించాలని, ఆయనలా అద్భుతమైన సినిమాలని తీయాలని అనిపించిందా? జేమ్స్ కామెరూన్ పై మీ అభిప్రాయమేంటి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఇన్ని సంచనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వస్తున్న మరో సంచలనం అవతార్ 2 పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేయండి.