ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలకు మధ్య బేధాలనేవి ఎవరూ పట్టించుకోవడం లేదు. సినిమాలో కంటెంట్ బాగుంటే పరభాషా చిత్రాలను కూడా తెలుగులో ఆదరించడం, తెలుగు సినిమాలు నచ్చితే పరభాషా ప్రేక్షకులు కలెక్షన్స్ కురిపించడం చూస్తూనే ఉన్నాం. అయితే.. సినిమాలతో పాటు నటులకు కూడా అప్పుడప్పుడు ప్రేక్షకులు కనెక్ట్ అయిపోతుంటారు. మామూలుగా తెలుగులోకి ఎంతోమంది బాలీవుడ్ నటులు విలన్స్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇస్తుంటారు. కానీ.. తెలుగు నటులు బాలీవుడ్ లో మెరవడం అనేది రేర్ గా చూస్తుంటాం. తాజాగా మరో టాలీవుడ్ కమెడియన్ బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైనట్లు తెలుస్తుంది.
అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టనుండటం విశేషం. టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో తాగుబోతు క్యారెక్టర్స్ తో ప్రేక్షకులను మెప్పించి.. చివరికి క్యారెక్టర్స్ లోని తాగుబోతునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అయితే.. ఇప్పటివరకూ తెలుగు సినిమాలలోనే అలరించిన రమేష్.. త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమాతో హిందీ సినిమాలో కామెడీ పండించనున్నట్లు సమాచారం. తెలుగులో కొంతకాలంగా సినిమాలు తగ్గించేసిన రమేష్.. రెగ్యులర్ గా కాకుండా అడపాదడపా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఏకంగా బాలీవుడ్ లో.. అదీ సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం అందుకున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి రమేష్ నిజంగానే సల్మాన్ ఖాన్ సినిమాలో ఛాన్స్ అందుకున్నాడా అంటే అవును. సల్మాన్ తో కలిసి ఫోటో దిగిన రమేష్.. సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా విషయాన్నీ ప్రకటించాడు. అయితే.. ఫొటోలో గమనిస్తే తాగుబోతు రమేష్.. సల్మాన్ తో సెట్ లో ఉన్నట్లే తెలుస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో.. బయట తాగడం అలవాటు లేని తాగుబోతు రమేష్.. బాలీవుడ్ ఎంటర్ అవ్వనున్నాడనే వార్త మాత్రం తెలుగు ఆడియెన్స్ కి కిక్కిస్తోంది. మరి చూడాలి తాగుబోతు రమేష్ బాలీవుడ్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో!