నోట్ల మార్పిడి దందాలో అరెస్ట్ అయిన స్వర్ణలతపై దర్శకుడు షాకింగ్ కామెంట్స్ చేశారు.
స్వర్ణలత కేసులో సినిమాని మించిన ట్విస్టులు బయటపడుతున్నాయి. రెండు వేల నోట్ల మార్పిడి దందా కేసులో స్వర్ణలత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇద్దరు రిటైర్డ్ నేవల్ ఆఫీసర్లను బెదిరించి రూ. 12 లక్షలు కాజేసిన స్వర్ణలత ప్రస్తుతం రిమాండ్ లో ఉంది. ఐతే ఈ కేసులో ఆమెకు ఊహించని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. స్వర్ణలతపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమెతో పాటు ఈ కేసులో ఏ2గా ఉన్న ఎం. హేమ సుందర్ ను కూడా సస్పెండ్ చేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీ.ఎం. త్రివిక్రమ్ వర్మ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఏపీ 31 దర్శకుడు స్వర్ణలతపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీ 31 సినిమాలో తానే హీరోయిన్ అనేట్టుగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చిన స్వర్ణలతకు ఏపీ 31 మూవీ దర్శకుడు కేవీఆర్ షాకిచ్చారు.
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో దర్శకుడు కేవీఆర్ స్వర్ణలత గురించి స్పందించారు. గత నాలుగు రోజులుగా స్వర్ణలతకి సంబంధించి ఏపీ 31 మూవీ పోస్టర్లు వైరల్ అవుతున్నాయని.. అవి తన దృష్టికి వచ్చాయని అన్నారు. అయితే పోస్టర్ లో కనబడుతున్న స్వర్ణలత అసలు హీరోయినే కాదని అన్నారు. ఈ సినిమాలో ఆమెది అతిథి పాత్ర మాత్రమేనని క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఆమె ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదని స్పష్టం చేశారు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన నారాయణ స్వామి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. మేనేజర్ ద్వారా తమకు స్వర్ణలత పరిచయమయ్యిందని.. రియల్ లైఫ్ లో సీఐ పాత్రనే ఈ సినిమాలో కూడా ఇచ్చామని.. సీఐ పాత్ర మాత్రమే చేస్తుందని స్పష్టం చేశారు.
ఈ సినిమాలో స్వర్ణలత హీరోయిన్ కాదని.. బిగ్ బాస్ సీజన్ 5లో పార్టిసిపేట్ చేసిన లహరి హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. స్వర్ణలతకు సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలు తమ సినిమాలోవి కాదని అన్నారు. అసలు ఇప్పటి వరకూ సినిమాకి సంబంధించి ఒక్క వీడియో కూడా బయటకు ఇవ్వలేదని అన్నారు. కాగా సినిమాల్లో రాణించాలన్న ఆమెకు బలమైన కోరిక ఉండడంతో.. కొరియోగ్రాఫర్ ను పెట్టుకుని మరీ డాన్సులు నేర్చుకున్న వీడియోలు, ఓ ప్రైవేట్ సాంగ్ వీడియో వైరల్ అయ్యాయి. అయితే వాటికి, ఏపీ 31 మూవీకి సంబంధం లేదని దర్శకుడు కేవీఆర్ స్పష్టం చేశారు. మరి ఏపీ 31 కాకుండా వేరే ఏదైనా సినిమా ఆఫర్ ఉందా? అందుకే ఆమె డాన్స్ లో శిక్షణ తీసుకుందా? అన్న సందేహం కలుగుతుంది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.