సినిమాలో హీరోయిన్ అంటే.. స్లిమ్‌గా.. అందంగా కనిపించాలి. ఒంటి మీద చటాకు కండ ఎక్కువగా కనిపించినా.. అబ్బో ఇంత లావయ్యింది.. ఈమెని ఎవరు చూస్తారు.. ఇదిగో ఎలాంటి మాటలు వినిపిస్తాయి. కాస్త బొద్దుగా ఉన్నా సరే.. పక్కన పెట్టేస్తారు. ఇలాంటి అభిప్రాయం ఉన్న ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు గీతా సింగ్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి.. హీరోయిన్‌గా మారారు. ఈవీవీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన కితకితలు చిత్రంలో హీరోయిన్‌గా చేశారు. ఈ సినిమాలో ఆమెని చూసిన వారు.. వామ్మో ఈమెంటి ఇంత లావుంది.. ఈమె హీరోయిన్ ఏంటి అని అనుకోలేదు. పాత్రలో సగటు మహిళ ఎదుర్కొనే సమస్యను చాలా చక్కగా నటించారు. బాహ్య సౌందర్యం కాదు.. మనసు ముఖ్యం అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఆ తర్వాత లేడీ కమెడియన్‌గా వరుస చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం ఆమెకి అవకాశాలు తగ్గాయి.
ఈ క్రమంలో తాజాగా సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి వివరించారు గీతా సింగ్. నమ్మిన వాళ్లే.. తనను దారుణంగా మోసం చేశారని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు గీతా సింగ్. డబ్బులు అవసరం ఉంటేనే… తాను కుటుంబానికి గుర్తుకు వస్తానని.. అంతేతప్ప… తన మీద కుటుంబ సభ్యులకు ప్రేమ లేదని చెప్పుకొచ్చారు. ఇక ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి సంపాందిచుకున్న డబ్బును ఓ మనిషిని నమ్మి పోగొట్టుకున్నాని తెలిపారు. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ని నమ్మి.. ఆమె దగ్గర చిట్టీలు వేశానని.. ఆమె మోసం చేయడంతో సుమారు 5 కోట్ల రూపాయలు నష్టపోయానని చెప్పుకొచ్చారు.
ఆ తర్వాత అందరు తనను డబ్బుల గురించి అడిగితే.. చాలా బాధనిపించింది అని.. ఆ సమయంలో అవన్ని తట్టుకోలేక రెండు సార్లు సూసైడ్ ప్రయత్నం చేశానని.. కానీ తన స్నేహితురాలు చూసి కాపాడిందని వెల్లడించారు. ఆ తర్వాత తనకు చనిపోయేంత ధైర్యం లేదని అర్థం అయ్యిందని.. అనంతరం ఆ ప్రయత్నాలు మానుకున్నానని.. బతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది.