తెలుగు చిత్ర పరిశ్రమకు రాజకీయాలకు విడదీయరాని సంబంధం ఉంది. హీరోలుగా వెండితెరపై ఓ వెలుగు వెలుగిన నటీ, నటులు ప్రజా జీవితంలోకి కూడా అడుగుపెట్టారు. అన్నగారు ఎన్టీ రామారావు రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. ఆయన అడుగుజాడల్లోనే నడిచారు సూపర్ స్టార్ కృష్ణ. అప్పటి రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన కృష్ణ.. మంగళవారం తెల్లవారు జామూన కాంటినెంటల్ హస్పిటల్లో తుది శ్వాస విడిచారు. దాంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. ఇక ఆయన రాజకీయాల్లోకి వచ్చారని చాలా మందికి తెలీదు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారి సూపర్ స్టార్ కృష్ణ రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం.
ఘట్టమనేని కృష్ణ.. తెలుగు చిత్ర పరిశ్రమలో డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. మూస పద్ధతిలో పోతున్న తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఒరవడిని నేర్పించాడు. కౌబాయ్, సస్పెన్స్, థ్రిల్లర్ లాంటి జోనర్లను తెలుగు పరిశ్రమకు పరిచయం చేసిన ఘనుడు సూపర్ స్టార్ కృష్ణ. అయితే కృష్ణ తొలుత రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. ఆయన రాజకీయ రంగప్రవేశం అనుకోకుండా జరిగింది. ఎన్టీఆర్ తొలి ఎన్నికలు ఎదుర్కొంటున్న సమయంలోనే సూపర్ స్టార్ హీరోగా ‘ఈనాడు’ అనే మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టీడీపీ మ్యానిఫెస్టోకు, పార్టీ విధానాలకు అనుకూలంగా ఉండటంతో.. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి అది ఉపయోగపడింది.
ఆ తర్వాత కొన్ని సంఘటనల నేపథ్యంలో ఎన్టీఆర్ కు కృష్ణకు మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంధిరా గాంధీ హత్యకు గురికావడంతో.. ఆమె అంత్యక్రియలకు సూపర్ స్టార్ హాజరైయ్యారు. అప్పటి నుంచి కృష్ణకు రాజీవ్ గాంధీతో మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ కు ధీటైన నాయకుడి కోసం చూస్తున్న కాంగ్రేస్ కు కృష్ణ ఒక ఆణిముత్యంలా దొరికాడు. అప్పటి నుంచి సూపర్ స్టార్ ను కాంగ్రేస్ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అటు కృష్ణ సైతం అప్పటి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎన్నో సినిమాలు చేశారు. రాజీవ్ గాంధీ ప్రోత్సాహాంతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఈ బుర్రిపాలెం బుల్లోడు. 1989 లో ఏలూరు నుంచి నేరుగా లోక్ సభ ఎంపీగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 71 వేల భారీ మెజార్టీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు సూపర్ స్టార్.
ఓ వైపు సినిమాలు మరోవైపు రాజకీయలతో కృష్ణ బిజీ బిజీగా గడిపారు. కార్యకర్తలను, పార్టీశ్రేణులను సొంత బిడ్డల్లా చూసుకున్నారు. దాంతో కృష్ణకు అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. తెలుగు పరిశ్రమలో తొలిసారిగా అభిమాన సంఘం ఏర్పాటు చేసింది సూపర్ స్టార్ కృష్ణకే. అయితే రెండేళ్లకే అంటే 1991లో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. దాంతో ఒక్కసారిగా కృష్ణకు కష్టాలు ఎదురైయ్యాయి. ఆప్త మిత్రుడైన రాజీవ్ గాంధీ మరణించడంతో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సూపర్ స్టార్ ఓడిపోయారు. ఈ సంఘటనల నేపథ్యంలో కృష్ణకు క్రమంగా రాజకీయంగా ఫాలోయింగ్ తగ్గిపోయింది.
తర్వాత ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేస్తా.. టికెట్ ఇవ్వమంటే కాంగ్రేస్ అధిష్టానం పట్టించుకోలేదు. దాంతో క్రమంగా ఆయన రాజకీయాల నుంచి దూరం అయ్యారు. చాలా సంవత్సరాల తర్వాత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత కృష్ణ విలువ తెలిసి ఆయన్ను రాజకీయాల్లోకి ఆహ్వానించారు. అయితే రాజశేఖర్ రెడ్డి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు సూపర్ స్టార్. కానీ ఆయన ఇప్పటి వరకూ కూడా కాంగ్రెస్ కు సానుభూతిపరులుగానే ఉన్నారు. అయితే సూపర్ స్టార్ అభిమానులు మాత్రం రాజీవ్ గాంధీ బతికుంటే కృష్ణ గ్యారంటీగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేవారని అప్పట్లో బలంగా చెప్పారు.