ఒక పక్క ఆర్థిక మాంద్యం కారణంగా అమెజాన్, మెటా సహా పలు ప్రముఖ కంపెనీలు టెక్కీలకు షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్ ఈ నెల 18న 18 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మెటా సంస్థ కూడా 11 వేల మంది టెకీలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ నేపథ్యంలో చాలా మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందో అన్న ఒత్తిడితో ఉన్నారు. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తం లక్షా 25 వేల నుంచి లక్షా 50 వేల ఉద్యోగులను నియమించుకోబోతున్న విషయాన్ని ప్రకటించింది. దీంతో టెకీలు అబ్బా సాయిరాం అనుకుంటున్నారు.
ప్రముఖ దిగ్గజ కంపెనీలన్నీ ఆర్థిక మాంద్యాన్ని తట్టుకోలేక చేతులెత్తేస్తుంటే.. టీసీఎస్ మాత్రం ఉన్న ఉద్యోగులను ఉంచుతూ.. కొత్తగా లక్షన్నర కొత్త ఉద్యోగాలు సృష్టించేందుకు సిద్ధమైంది. డిసెంబర్ తో ముగిసిన త్రైమాసికం నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి లక్షా 25 వేల నుంచి లక్షన్నర మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. గత ఏడాది డిసెంబర్ నెల ముగిసేనాటికి సంస్థలో 6,13,974 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. త్రైమాసికంలో 2,197 మంది ఉద్యోగులు రిజైన్ చేసి వెళ్లిపోయారు.
అదే సమయంలో గడిచిన 18 నెలలలో టీసీఎస్ సంస్థ భారీగా నియామకాలను చేపట్టింది. క్యూ3 ఫలితాలను వెల్లడించిన సందర్భంగా.. సంస్థ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ గోపీనాథన్ మీడియాతో మాట్లాడారు. ‘తగ్గిన వర్క్ ఫోర్స్ నష్టాన్ని పూడ్చుకునే క్రమంలో డిసెంబర్ త్రైమాసికం నాటికి కొత్త నియామకాలు చేపట్టేందుకు కసరత్తులు చేస్తుంది. గత ఏడాదిన్నరలో భారీగా నియామకాలు చేపట్టినా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో లే-ఆఫ్స్ ప్రస్తావన లేదు. ఓవరాల్ గా నియామకాల ట్రెండ్ ఎప్పటిలానే కొనసాగుతుంది. వచ్చే ఏడాది లక్షా 25 వేల నుంచి లక్షా 50 వేల మందిని కొత్తగా నియమించుకుంటాం. మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కోణంలో సంస్థ విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు ఈ నియామకాలు చేపడతాం’ అని కంపెనీ రాజేష్ గోపీనాథన్ అన్నారు.
ఇక అనుభవం ఉన్న టెకీలతో పాటు ఫ్రెషర్స్ ని కూడా నియమించుకుంటున్నట్లు కంపెనీ తెలిపింది. 5 లక్షల మందికి పైగా ఫ్రెషర్స్ దరఖాస్తు చేసుకోగా.. వీరిలో 40 వేల మందిని ఫ్రెషర్స్ ని నియమించుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. అదన్నమాట విషయం. ఒక పక్క కొన్ని దిగ్గజ కంపెనీలు ఉన్న ఉద్యోగులను ఫైర్ అంటుంటే.. టీసీఎస్ మాత్రం కొత్త ఉద్యోగులు హైర్ అంటోంది. ఊపిరి పీల్చుకో టెకీ.. భారీ నియామకాలతో TCS వస్తోంది.. వెయ్యి, 2 వేలు కాదు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. మరి లక్షన్నర ఉద్యోగాలను నియమించేందుకు సిద్ధమైన టీసీఎస్ సంస్థపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.