దేశంలో నిరుద్యోగిత పెరుగుతోంది.. ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది.. ద్రవ్యోల్బణం పెరుగుతుంది.. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక.. దేశ అభివృద్ధి కుంటుపడింది.. నిరుద్యోగుల సంఖ్య పెరిగింది అంటూ విపక్షాలు సందర్భం దొరికిన ప్రతిసారి ప్రభుత్వంపై విమర్శలు చేస్తోన్న సంగతి తెలిసిందే. నిరుద్యోగులు కూడా ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. అటు చూస్తే లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం మాత్రమే ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల భర్తీకి సిద్దమవుతోంది. ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలోనే వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ అన్ని ప్రభుత్వ సంస్థలకు సూచించింది. ఒక్కసారి ఖాళీల వివరాలు వస్తే.. వాటిని వెంటనే భర్తీ చేసేందుకు రెడీ అవుతోంది. డిసెంబర్ వరకు గుర్తించే ఖాళీలను వచ్చే ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ కల్లా భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో నియమాకాలకు కాస్త ఎక్కువ సమయం పడుతునంది. అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆ సమయం మరి కాస్త ఎక్కువ ఉంటుంది. కారణం.. దేశవ్యాప్తంగా అభ్యర్థులు పాల్గొనడం, మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో రిక్రూట్ చేయడం వంటి వాటి వల్ల ఎక్కువ సమయం పడుతుంది. అధికారిక లెక్కల ప్రకారం 2021 సంవత్సరం చివరి నాటికి.. దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభత్వు రంగ సంస్థలు ఉన్నాయి. వీటిలో 177 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీలు ఏకంగా 1.89 లక్షల కోట్ల రూపాయల లాభాలు సాధించాయి.
వచ్చే ఏడాదిన్న వ్యవధిలో యుద్ధప్రాతిపదికన ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మోదీ ఇప్పటికే వివిధ శాఖలకు, విభాగాలకు సూచించారు. ఈ మేరకు జూన్‌లో ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగానే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత నెలలోనే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో మీటింగ్ నిర్వహించింది. ఇప్పటికే పలు బ్యాంకులు రిక్రూట్‌మెంట్ కోసం ప్రకటనలు కూడా జారీ చేయడం ప్రారంభించాయి.