ఆడవాళ్లకు దూరంగా ఉండే అతడు.. ఆమెని ప్రేమించాడు. ఆమె తన జీవితం అనుకున్నాడు. ఆమె సంతోషం కోసం.. ప్రియురాలికి దూరమైనా పర్వాలేదు అనుకున్నాడు. అతడు ఇంతలా ప్రేమిస్తే.. ఆ అమ్మాయి మాత్రం మరొకరికి దగ్గరయ్యింది. ఆమె మోసాన్ని భరించలేక.. దారుణ నిర్ణయం తీసుకున్నాడు ప్రియుడు. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్, గ్రేటర్ నోయిడా పరిధిలోని శివ్ నాడార్ యూనివర్సిటీ క్యాంపస్‌లో చోటు చేసుకున్న దారుణం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఏ సోషియాలజీ మూడో సంవత్సరం చదువుతోన్న స్నేహ చౌరాసియాను.. అదే సెక్షన్‌కు చెందిన అనుజ్ సింగ్.. పిస్టోల్‌తో కాల్చి చంపిన వీడియో.. దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. యువతిని కాల్చి చంపిన తర్వాత.. అనుజ్ హాస్టల్ గదికి వెళ్లి.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ దారుణానికి ఒడిట్టడానికి ముందే.. అనుజ్ తాను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ.. ఓ వీడియోని తన జీమెయిల్ అకౌంట్‌లో సేవ్ చేశాడు. పోలీసులు దీన్ని స్వాధీనపర్చుకున్నారు. స్నేహ చౌరాసియా తన జీవితంతో ఎలా ఆటలాడుకుందో.. ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు అనుజ్.
వీడియోలో అనుజ్ మాట్లాడుతూ.. ‘‘నా పేరు అనుజ్.. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు.. బాధ పెట్టలేదు. ఒకప్పుడు నా జీవితం అల్లకల్లోలంగా ఉండేది. మానసికంగా ఎంతో కుమిలిపోయేవాడిని. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవి చూశాను. ముందు నుంచి కూడా నేను అమ్మాయిలకు చాలా దూరంగా ఉండేవాడిని. కారణం నా జీవితంలో నేను చూసిన సంఘటనలు. నా సోదరిని.. ఆమె భర్త సజీవదహనం చేశాడు. మా మామయ్యను ఆయన భార్య వదిలి వెళ్లడంతో.. గుండెపోటుతో మృతి చెందాడు. ఇవన్ని చూసిన తర్వాత.. నేను అమ్మాయిలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘అయితే స్నేహ పరిచయం నా జీవితంలోకి సంతోషాలను తీసుకువచ్చింది. తను నాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ తర్వాత నేను ఆమెను ప్రేమించడం ప్రారంభించాను. ఒక రోజు ఆమెకు ప్రపోజ్ చేశాను. తను కూడా ఓకే చెప్పింది. అప్పటి నుంచి సుమారు ఏడాదిన్నర కాలం పాటు మేం ఎంతో సంతోషంగా గడిపాం. అలా హాయిగా సాగుతున్న మా ప్రయాణంలో సడెన్‌గా బ్రేక్ పడింది. ఒకరోజు స్నేహ నా దగ్గరకు వచ్చి.. తాను మానసికంగా ఎంతో కుమిలిపోయానని.. కాబట్టి తనకు దూరంగా ఉండమని కోరుతూ.. మా ప్రేమకు బ్రేకప్ చెప్పింది. ఆమె మాటలు నిజమని నమ్మిన నేను.. ఆమె సంతోషంగా ఉంటే చాలు అనుకుని.. ఆమెకు దూరం అయ్యాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘ఆ తర్వాత అసలు విషయం తెలిసింది. స్నేహకు కాలేజీలో పని చేసే మరో వ్యక్తితో సంబంధం ఉంది. అందుకే తను నాకు దూరం అయ్యింది. తనకు మరో వ్యక్తితో సంబంధం ఉందనడానికి నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ముందు నుంచి కూడా నాకు స్నేహ ప్రవర్తన మీద అనుమానంగా ఉండేది. తన ఫోన్ నాకు ఇచ్చేది కాదు.. వాట్సాప్ చాట్ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేది. ఎందుకు అని ప్రశ్నిస్తే.. నమ్మకం లేదా అనేది. ఇలా ఉండగానే ఒకరోజు బ్రేకప్ చెప్పింది. అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను కానీ.. తను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. కానీ తర్వాత ఆమె చేసిన మోసం నాకు తెలిసింది. అది నన్ను ఎంతో బాధించింది. అందుకే తనను చంపాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నందకు స్నేహ తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతున్నాను. మీకు బాధగా ఉండవచ్చు. కానీ తనలాంటి వ్యక్తి బతికుంటే.. ఈరోజు నేను.. రేపు మరొకరు.. ఆ తర్వాత ఇంకొకరు.. స్నేహ చేతిలో మోసపోతునే ఉంటారు. తనలాంటి అమ్మాయికి బతికే హక్కు లేదు. అందుకే తనను చంపేస్తున్నాను. నేను కూడా ఎక్కువ రోజులు బతకను. నాకు బ్రేయిన్ క్యాన్సర్. ఎక్కవ సమయం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.. ఆమె చేసిన దానికి ప్రతిఫలం అనుభవించాలి’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
ఎప్పటిలాగానే గురువారం విద్యార్థులంతా యూనివర్సిటీ క్యాంటీన్‌లో భోజనం చేస్తున్నారు. ఇంతలో అనుజ్.. స్నేహా టేబుల్ వద్దకు వచ్చి ఆమెతో మాట్లాడుతుండగా ఇద్దరి మధ్య గొడవ ప్రారంభం అయినట్లు ప్రత్యక్షంగా చూసిన విద్యార్థులు తెలిపారు. దాంతో ఆగ్రహానికి గురైన అనుజ్.. తనతో తెచ్చుకున్న తుపాకీని బయటికి తీసి స్నేహను కాల్చి చంపాడు. ఈ ఘటనతో అక్కడున్న విద్యార్థులంతా భయంతో పరిగెత్తారు. స్నేహను హత్య చేసిన తర్వాత అనుజ్ హస్టల్ గదిలో తన రూమ్‌కు వెళ్లి.. తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.