ఇటీవలి కాలంలో దాంపత్య బంధాన్ని చిన్నబుచ్చేలా ఎన్నో సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. క్షణిక సుఖాల కోసం కట్టుకున్న వారిని కడ తేర్చడానికి కూడా వెనుకాడటం లేదు. కట్టుకున్న భర్తైనా, తననే నమ్మి వచ్చిన భార్య అయినా వారి చీకటి బంధానికి అడ్డొస్తే మాత్రం అంత మొందించేస్తున్నారు. తాళిని ఎగతాళి చేస్తూ 5 నిమిషాల అల్ప సంతోషం కోసం పాకులాడుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. ఆ వివరాల్లోకి వెళితే..
విజయనగరం జిల్లా గంట్యాడ మండలం లక్కిడాం గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం తులసీ అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ నెల 12న కొటారుబిల్లి వద్ద రాము ప్రమాదంలో గాయపడి చనిపోయినట్లు అతని తమ్ముడికి స్థానికులు ఫోన్ చేసి చెప్పారు. అక్కడికి వెళ్లి చూస్తే మృతదేహం ఒక దగ్గర, బండి ఒక దగ్గర కనిపించాయి. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ అక్కడి ఆధారాలను సేకరించారు. మృతదేహం ఉన్న తీరు, అక్కడి వాతావరణం చూసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. పలు కోణాల్లో విచారణ జరిపారు. ఎంక్వైరీలో భాగంగా భార్య తులసిని ప్రశ్నించగా విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.
రాము భార్య తులసికి పెళ్లి తర్వాత వేరే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ విషయం రాముకి కూడా తెలిసి పలుసార్లు మందలించినట్లు, ఆ బంధం వల్ల వారికి గొడవలు జరుగినట్లు తులసి ఒప్పుకొంది. రాము ఆస్పత్రికి వెళ్తున్నట్లు తన ప్రియుడికి తులసి సమాచారం ఇచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ రాత్రి పూట రాము వచ్చే దారిలో మాటువేసి అడ్డగించారు. ప్రియుడితో కలిసి రాముని కొట్టి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని చూశారు.
బండిని ఒక దగ్గర పడేసి.. రాము మృతదేహాన్ని దూరంగా ఈడ్చుకువెళ్లారు. అయితే ఏదో వాహనం గుద్ది ఉంటుందని అనుకుంటారని భావించారు. కాకపోతే వాళ్లు చేసిన ఆ ఒక్క తప్పే వాళ్లను పట్టించింది. తులసీ నేరం అంగీకరించడంతో ఆమెను, ప్రియుడిని ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. భర్తను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.