యానాంకి చెందిన సాయిరత్న శ్రీకాంత్ (33) అనే యూకో బ్యాంకు మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాంత్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. ఈ ఘటన మచిలీపట్నంలో చర్చనీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బ్రాంచ్ లోని బ్యాలెన్స్ షీట్ లో కొంత డబ్బులు తక్కువగా ఉందని, ఆ డబ్బును శ్రీకాంత్ అనధికారింగా తీసుకున్నారని అస్టిస్టెంట్ మేనేజర్, క్యాషియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీకాంత్ పనిచేసే బ్యాంక్ బ్యాంచ్ బ్యాలెన్స్ షీట్ లో రూ.29 లక్షలు తక్కువగా ఉందని, ఆ డబ్బులను ఆత్మహత్య చేసుకున్న శ్రీకాంతే అనధికారింగా వాడుకున్నారని అస్టిస్టెంట్ మేనేజర్ కోమలి, క్యాషియర్ విమలా జ్యోతి బుధవారం యానాం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మంగళవారం తాము బ్యాంకు తెరచి.. కంప్యూటర్ లో బ్రాంచ్ బ్యాలెన్స్ షీట్ చెక్ చేయగా .. అందులో నగదు తక్కువగా చూపిందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కోణంలోనే బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. దర్యాప్తులో భాగంగా బ్రాంచ్ లో ఉన్న రికార్డులను తనిఖీ చేసినట్లు తెలిసింది. అయితే మచిలీపట్నం యూకో బ్రాంచ్ మేనేజర్ గా పనిచేస్తున్న శ్రీకాంత్.. తాను ఇచ్చిన రుణాలను.. తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో..ఆయనే బ్యాంకు నిబంధనల ప్రకారం చెల్లించినట్లు సమాచారం.
రుణాల చెల్లింపుల కోసం ఆయన పలువురి వద్ద అప్పులు చేసినట్లు , వాటికి వడ్డీలు సైతం కడుతున్నట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే శ్రీకాంత్ మానసికంగా ఒత్తిడికి గురై.. ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై బ్యాంకు ఉన్నతాధికారులు స్పందించారు. యానాం యూకో బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ పై రుణాల రికవరీ కోసం బ్యాంకు అధికారులు ఒత్తిడి తెచ్చిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని పూర్తిగా నిరాధారమని ఆ బ్యాంకు హైదరాబాద్ జోన్ ల్ మేనేజర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.