హైదరాబాద్ లో ఈ మధ్య మాదాపూర్ లో జరిగిన కాల్పుల కలకలం మరువకముందే మరో చోట కాల్పుల కలకలం రేగింది. నల్గొండ జిల్లా మునుగోడులో కాల్పులు కలకలం సృష్టించాయి. మునుగోడు మండలం ఊకొండి గ్రామం వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. 3 రౌండ్లు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి మునుగోడులో కూల్‌డ్రింక్స్, నీటి బాటిళ్లను విక్రయిస్తూ దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. లింగస్వామి ద్విచక్ర వాహనంపై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో మునుగోడు మండలం సింగారం శివారు దాటగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్ర వాహనంపై వచ్చి గన్ తో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దుండగులు లింగస్వామి చనిపోయినట్లు భావించి అక్కడ నుంచి ఉడాయించారు.
కాల్పుల శబ్దం విన్న స్వామి అనే వ్యక్తి విని వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అపస్మారక స్థితిలో వున్న బాధితుడు.. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్వగ్రామమైన బ్రహ్మణవెల్లంల గ్రామానికి చెందిన లింగస్వామిగా గుర్తించి నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లుగా సమాచారం. సంఘటన జరిగిన స్థలంలో ఒక బుల్లెట్ లభించిందని నల్గొండ డీఎస్పీ నర్సింహరెడ్డి తెలిపారు.ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.