అత్తిటి వేధింపులు అనగానే మనకు మహిళలే గుర్తుకు వస్తారు. అవును అనాదిగా వారు మెట్టినింట్లో వేధింపులు ఎదుర్కొన్నారు.. ఇప్పటికి ఎదుర్కొంటున్నారు. అయితే అత్తింటి వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో మగవారు కూడా ఉంటారు. కానీ చాలా వరకు బయటపడరు. అవమానంగా భావిస్తారు. వాటిని భరించలేక ఆఖరికి ఆత్మహత్య చేసుకుంటారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. భార్య, అత్తింటి వారి చేతిలో ఎంత దారుణంగా మోసపోయాడో చెప్పుకొచ్చాడు ఓ వ్యక్తి. ఆ వివరాలు..
వారిది అన్యోన్య దాంపత్యం. విదేశాల్లో మంచి ఉద్యోగం. చేతి నిండా సంపాదన.. అందమైన భార్య.. ముద్దులొలికే చిన్నారి. తాను ఆనందంగా బతకడానికి ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాడు. అన్ని మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. సంతోషంగా సాగుతున్న వారి జీవితంలోకి ఓ విలన్ ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా బామ్మర్ది రూపంలో. వాస్తవంగా చెప్పాలంటే.. బావ మేలు కోరేవాడు.. తన సోదరి జీవితం బాగుండాలని కోరుకునే వాళ్ల లిస్ట్‌లో ముందు బామ్మర్ది పేరు ఉంటుంది. కానీ ఈ కథలో మాత్రం అతడే విలన్. అవసరం కొద్ది బావ దగ్గర లక్షల రూపాయలు తీసుకున్నాడు. తీరా తిరిగి చెల్లించమంటే.. కోపంతో ఊగిపోయాడు.
దాంతో అక్క, బావల మధ్య చిచ్చు పెట్టాడు. కట్ చేస్తే.. భార్య, బామ్మర్ది, అత్తింటి వేధింపులు భరించలేక.. ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ నిర్ణమం తీసుకోవడానికి ముందు తాను అనుభవించిన మానసిక వ్యధను వీడియోలో చెప్పుకొచ్చాడు. మరో దారుణం ఏంటంటే.. భార్య అతగాడిని మోసం చేసి.. మరో వ్యక్తికి దగ్గరయ్యింది. వీటన్నింటిని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆ వివరాలు..
బైజు రాజు అనే వ్యక్తి స్వస్థలం కేరళ, కట్టనాం. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో వర్క్ చేస్తున్నాడు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అతడు తన ఫేస్‌బుక్‌లో మై లాస్ట్ పేరిటి వీడియో షేర్ చేశాడు. దీనిలో తాను.. తన భార్య ప్రవర్తన, అత్తింటి వాళ్ల తీరు వల్ల ఎంత మనోవేదనకు గురయ్యాడో చెప్పుకొచ్చాడు. తాను భార్య, బిడ్డలతో సంతోషంగా ఉండేవాడనని తెలిపాడు. కానీ తన భార్య సోదరుడికి లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చానని.. ఆ డబ్బులు తిరిగి చెల్లించమని కోరితే.. అతడు తనకు, తన భార్యకు మధ్య గొడవలు పెట్టాడని చెప్పుకొచ్చాడు. భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయని.. ఈ క్రమంలో తన భార్య.. మరో వ్యక్తితో సంబంధం పెట్టుకుని తనను మోసం చేసిందని చెప్పుకొచ్చాడు.
భార్య, ఆమె కుటుంబ సభ్యులు.. తన దగ్గర నుంచి మొత్తం డబ్బులు తీసుకున్నారని.. తన అత్త.. అన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసుకుందని చెప్పుకొచ్చాడు. అంతేకాక తన భార్య.. కుమార్తెను తీసుకుని.. పుట్టింటికి వెళ్లి పోయిందని.. తనకున్న ఒకే ఒక్క ఆశ కుమార్తె అని.. తనను కూడా దూరం చేశారని.. ఇప్పుడు ఆ ఆశ కూడా చనిపోయిందని చెప్పుకొచ్చాడు. తన భార్య, అత్తంటి వారు తప్పు చేసి.. తన మీద తప్పుడు కేసులు పెట్టి.. వేధిస్తున్నారని.. బిడ్డను కూడా చూడనివ్వడం లేదని వాపోయాడు. ఆత్మహత్య చేసుకోవడం నేరమని.. ఆ విషయం తనకు తెలుసని.. కానీ తనకు బతకడానికి ఒక్క ఆశ కూడా లేదని చెప్పుకొచ్చాడు. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్య.. తనను దారుణంగా మోసం చేసిందని.. దాన్ని తట్టుకోలకపోతున్నాను అని చెప్పుకొచ్చాడు.
ఇక తన భార్య.. సంబంధం పెట్టుకున్న వ్యక్తి గురించి ఆమెను నిలదీసిన వీడియోని కూడా తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు బైజు. ఈ పరిణామాలన్నింటి కారణంగా తాను ఎంతో బాధపడ్డానని.. నిద్రలేని రాత్రులు గడిపానని.. ఇంకా భరించడం తన వల్ల కాదని.. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతోంది. దీపికా నారాయణ్ భరద్వాజ్.. ఈ వీడియోని తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. ఇండియాలో చాలా మంది మగవాళ్లు.. ఇలాంటి సమస్యల్నే ఎదుర్కొంటున్నారు అని ట్వీట్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. మరి బైజు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.