ఒకప్పుడు ప్రేమ పేరుతో యువతుల వెంటపడి వేధించి.. కాదంటే ప్రాణాలు తీసే యువకుల గురించి వార్తలు చదివాం. అయితే రానురాను పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసే యువతుల సంఖ్య పెరుగుతోంది. ప్రేమ పేరు చెప్పి.. ఒకరితో తిరగడం.. ఆ తర్వాత మరొకరిని వివాహం చేసుకోవడం.. ఒకవేళ ప్రియుడు అడ్డుపడితే.. అతడిని చంపేందుకు కూడా వెనకాడని కిలేడీల గురించి ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం. ప్రేమ, వివాహేతర సంబంధం కారణాలు ఏవైనా సరే.. వీటి మోజులో పడి.. భర్త, ప్రియుడి ప్రాణాలు తీస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియుడి గొంతు కోసం హత్య చేయాలని భావించింది ఓ యువతి. కాకపోతే అతడి అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ ప్రమాదంలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు.
ఈ దారుణ సంఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాధితుడిని గుంటూరుకు చెందిన అశోక్‌గా గుర్తించారు పోలీసులు. చదువు పూర్తి చేసిన అశోక్ ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కేపీహెచ్‌బీలో ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో అతడికి నిందితురాలు లక్ష్మీ సౌమ్య అనే యువతితో పరిచయం ఏర్పడింది. రాజమండ్రికి చెందిన లక్ష్మీ సౌమ్య.. బీబీఏ పూర్తి చేసి.. ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చింది. ఆమె కూడా కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటుంది. వీరిద్దరికి ఓ టీ స్టాల్ వద్ద పరిచయం ఏర్పడింది. 6 నెలలుగా వీరి మధ్య పరిచయం ఉంది. ఇద్దరు తరచుగా టీస్టాల్ వద్ద కలుసుకునేవారు.
ఈ క్రమంలో అశోక్.. లక్ష్మీని ప్రేమించాడు. ఆమె మనసులో ఏం ఉందో తెలియదు కానీ.. పైకి మాత్రం అశోక్‌తో బాగానే ఉండేది. ఇలా ఉండగా.. కొన్ని రోజుల క్రితం లక్ష్మీ సౌమ్య హాస్టల్‌లో ఏదో గొడవ చేయడంతో.. నిర్వాహాకులు ఆమెను బయటకు పంపించారు. ప్రస్తుతం ఆమె కేపీహెచ్‌బీ తొమ్మిదో ఫేజ్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటుంది. అశోక్ ఆమె హాస్టల్ ఫీజులు కడుతూ.. ఖర్చులన్ని భరిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా అశోక్.. పెళ్లి చేసుకుందామని.. లక్ష్మీ సౌమ్యను అడుగుతుండేవాడు. ఆమె సమాధానం చెప్పకుండా దాటవేస్తూ ఉండేది.
ఈ క్రమంలో ఈ నెల 5న అశోక్ పుట్టిన రోజు సందర్భంగా.. ఇద్దరూ రాత్రి ఏడు గంటల ప్రాంతంలో టీ స్టాల్ వద్ద కలుసుకున్నారు. పెళ్లి చేసుకుందామంటూ అశోక్ మరోసారి వివాహ ప్రస్తావన తెచ్చాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పటికే మినీ కట్టర్(బ్లేడ్)తో వచ్చిన లక్ష్మీ సౌమ్య.. అశోక్ గొంతుపై దాడి చేయబోయింది. అయితే ప్రమాదాన్ని గుర్తించిన అశోక్.. తప్పించుకోవడంతో.. అతడి మెడ, చెంప కింద లోతుగా కోసుకుపోయింది. ఈ గొడవ గమనించిన స్థానికులు.. అశోక్‌ని అదే రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించాగా.. అతడికి 50 కుట్లు పడ్డాయి. ఇక అశోక్ తండ్రి ఫిర్యాదుతో.. పోలీసులు కేసు నమోదు చేసి.. లక్ష్మీని అదుపులోకి తీసుకున్నారు.