ఒక మాజీ ఐపీఎస్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నగలు, బంగారంతో పాటు విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యాయి. మిగిలిన వివరాలు..
హైదరాబాద్లో భారీ దొంగతనం చోటుచేసుకుంది. నగరంలోని ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఇంట్లో ఈ చోరీ జరిగింది. జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్ ఫ్లాట్ నంబర్ 222లో నివసించే మాజీ ఐపీఎస్ కొమ్మి ఆనందయ్య ఈనెల 16న భార్యతో కలసి కాకినాడకు వెళ్లారు. కాకినాడలో మున్సిపల్ కమిషనర్గా ఉన్న తన కుమారుడు రమేష్ ఇంటికి ఆనందయ్య వెళ్లారు. శనివారం ఆనందయ్య ఇంటి దగ్గర పనిచేస్తూ కింద సెల్లార్లో ఉండే డ్రైవర్ కాల్ చేసి ఇంట్లో దొంగతనం జరిగిన విషయాన్ని తెలిపాడు. దీంతో ఆయన వచ్చి పరిశీలించారు. అల్మారాలో ఉంచిన 30 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.40 వేల నగదు, 500 అమెరికన్ డాలర్లు, ఎనిమిది విలువైన చేతి గడియారాలు దొంగతనానికి గురైనట్లు గుర్తించారు.
చోరీ విషయాన్ని జూబ్లీ హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆనందయ్య. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలించగా.. దొంగ శుక్రవారం రాత్రి 1.15 ప్రాంతంలో ఆనందయ్య ఇంటి వెనుక వైపు నుంచి రెండో అంతస్తుకు వెళ్లాడు. అక్కడ బోల్టు పెట్టిన తలుపును తన్ని, అది తెరుచుకోకపోవడంతో తొలుత కిచెన్లోకి వెళ్లాడు. కొన్ని వెండి వస్తువులను ఒక సంచిలో వేసుకున్నాడు. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్లి బీరువా తాళం లేకుండానే తెరిచాడు. బీరువాలోని లాకర్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతో పాటు డబ్బులు, డాలర్లు, చేతిగడియారాలను తీసుకున్నాడు. గంటసేపటి తర్వాత బయటకు వచ్చి, లిఫ్ట్ అడిగి సీవీఆర్ చౌరస్తాకు చేరుకున్నాడు. ముందుగా రెక్కీ చేసిన తర్వాతే ఈ దొంగతనానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దొంగను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.