హైదరాబాద్ లోని నరబలి కలకలం రేపింది. 8 ఏళ్ల బాలుడ్ని నరబలి ఇచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, నకిలీ జ్యోతిష్కులు, నకిలీ స్వామీజీల మాయమాటలు నమ్మి కొంతమంది మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. తమకేదో కలిసి వస్తుందని చెప్పి నరబలికి పాల్పడుతున్నారు. క్షుద్రపూజలు, చేతబడులు వంటివి చేసి ప్రజల ఆగ్రహానికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు మరీ ఎక్కువైపోయాయి. ఒకపక్క ప్రపంచమంతా సాంకేతికంగా ముందుకు పోతుంటే.. మరోపక్క మూఢనమ్మకాలు, చేతబడులు, క్షుద్రపూజలు, నరబలులతో దేశం వెనక్కి వెళ్ళిపోతుంది. చిన్న పిల్లలను ఎక్కువగా నరబలి ఇస్తున్న వార్తలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. తాజాగా ఓ బాలుడ్ని నరబలి ఇచ్చిన ఘటన కలకలం రేపుతోంది.
హైదరాబాద్ లోని సనత్ నగర్ లో బాలుడ్ని నరబలి ఇచ్చిన ఘటన కలకలం సృష్టించింది. అల్లాదున్ కోటి ఏరియాలో 8 ఏళ్ల అబ్దుల్ వాహీద్ అనే బాలుడ్ని అమావాస్య రోజున నరబలి ఇచ్చారు. ఆ బాలుడ్ని ఓ హిజ్రా బలి ఇచ్చిందని స్థానికులు ఆరోపిస్తూ.. హిజ్రా ఇంటిపై దాడికి పాల్పడ్డారు. హిజ్రా ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్థానికుల ఆరోపణల మేరకు హిజ్రాను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు స్థానికుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. నరబలి ఎందుకు ఇచ్చారు? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న అమావాస్య రోజున బాలుడ్ని బలి ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. బాలుడి మృతదేహాన్ని సమీపంలోని నాలాలో గుర్తించిన స్థానికులు.. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. క్షుద్రపూజలు నిర్వహించిన తర్వాత బాలుడ్ని నరబలి ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు ఆ ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. ఒక్కరు చేసిన పని కాదని, హిజ్రాకు ఎవరో సహాయం చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు. హిజ్రాకు సహకరించిన నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.