ఈ మధ్య చిన్న చిన్న కారణాలకే ప్రాణాలు తీయడం చూస్తున్నాం. అసలు ఇంత చిన్న కారణానికి హత్య చేస్తారా? అని భయాందోళనకు గురయ్యేలా ఘటనలు ఉంటున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి గుంటూరులో వెలుగు చూసింది.
కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే చాలా దూరం వెళ్తాయి. అంతా అయిపోయాక ఇంత చిన్న కారణానికా ఇంత పని చేశారు? అనే ప్రశ్న రాక మానదు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఆ కోవకు చెందిన ఘటనే. రూ.100 వద్ద మొదలైన గొడవ ఏకంగా ఒక మనిషి ప్రాణం పోయేలా చేసింది. అప్పటివరకు మిత్రుల్లా ఉన్న వాళ్లు ఒక్కసారిగా శత్రువుల్లా మారి రూ.వంద కోసం గొడవకు దిగారు. వారిలో ఒకరు రెండో వ్యక్తి అతి కిరాతకంగా రాయితో తలపై కొట్టి దారుణంగా హత్య చేశాడు. అతను చనిపోయిన తీరు చూసి అందరూ వారి మధ్య ఏవో పాత కక్షలు, భూవివాదాలు ఉంటాయేమో అనుకుంటారు.
ఈ హత్య గుంటూరు నుంచి అమరావతి వెళ్లే రోడ్డులో జరిగింది. శారదానగర్ కాలనీకి చెందిన జరిపిటి రవి(38) రాడ్ బెండింగ్, బేల్దార్ కూలీగా చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బాజీ అనే వ్యక్తి కూడా రవిలాగానే బేల్దార్ పనికి కూలీగా వెళ్తుంటాడు. మేస్త్రీ వీళ్లిద్దరకీ రూ.వంద చొప్పున ఇచ్చాడు. అయితే గతంలో ఓసారి బాజీ రూ.వంద రవి తీసుకున్నాడు. వీళ్లిద్దరు ఆంజనేయపేటలో మద్యం సేవిస్తున్న సమయంలో ఈ రూ.వంద టాపిక్ వచ్చింది. తనకు రావాల్సిన రూ.వంద ఇవ్వాలని బాజీ- రవిని అడిగాడు. అందుకు రవి తర్వాత ఇస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఆ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
అయితే ఘర్షణ తర్వాత రవి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి అమరావతి రోడ్డులో ఉన్న ఓ టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుతున్నాడు. అక్కడికి బాజీ కూడా వచ్చాడు. టీ స్టాల్ దగ్గర కూడా వాల్లిద్దరి మధ్య మరోసారి ఘర్షణ జరిగింది. ఈసారి బాజీ మద్యం మత్తులో పక్కనే ఉన్న రాయి తెచ్చి రవి తల పగలగొట్టాడు. బాజీ కొట్టిన దెబ్బలకు రవి అక్కడికక్కడే మృతి చెందాడు. రవి సోదరి మావుళ్లమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అరండల్ పేట్ సీఐ రామనాయక్ ఘటనాస్థలిని పరిశీలించి.. బాజీని అదుపులోకి తీసుకున్నారు. రూ.వంద కోసమే ఈ హత్య జరిగిందా? మరేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నారు.