అమాయకులు ఉన్నంత కాలం.. కేటుగాళ్ల ఆటలు సాగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో మ్యాట్రిమోని సైట్ల పేరుతో జరుగుతున్న మోసాలు పెరుగుతున్నాయి. ఈ తరహా మోసాలకు పాల్పడే కేటుగాళ్లు.. ముందు మాయమాటలతో నమ్మిస్తారు. తాము విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామని నమ్మబలుకుతారు. నీకోసం గిఫ్ట్ పంపించాను.. నువ్వు జస్ట్ టాక్స్ కడితే సరిపోతుంది అంటారు. అప్పటికే ఇలాంటి కేటుగాళ్ల వలలో చిక్కుకున్న బాధితులు.. భారీగా డబ్బులు మోసపోతారు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండదు. ఇప్పటికే ఈ తరహా మోసాలు అనేకం వెలుగు చూడగా.. తాజాగా వీటిని తలదన్నే సీన్ ఒకటి వెలుగులోకి వచ్చింది. సదరు కేటుగాడు ఏకంగా తాను అంతరిక్షంలో ఉన్నానని.. భూమ్మీదకు వచ్చాక పెళ్లి చేసుకుంటాను అని నమ్మబలికాడు. ఇక భూమ్మీదకు రావడానికి సుమారు 25 లక్షలు అవసరం అవుతాయని.. చెప్పి.. ఆ మొత్తం బాధితురాలి వద్ద నుంచి తీసుకున్నాడు. ఆ తర్వాత కూడా డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఈ సంఘటన జపాన్‌లో చోటు చేసుకుంది. ఈ దేశానికి చెందిన 65 ఏళ్ల మహిళకు సదరు కేటుగాడు.. సోషల్ మీడియాలో పరిచయం అయ్యాడు. తాను రష్యాకు చెందిన వ్యోమగామినని పరిచయం చేసుకున్నాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో పని చేస్తున్నట్లు నమ్మబలికాడు. కొన్ని నకిలీ ఫోటోలను ఆమెకు పంపాడు. వాటిని చూసిన మహిళ.. నిజమే అని నమ్మింది. అలా వారి పరిచయం పెరిగింది. ఇద్దరు మెసేజ్‌లు చేసుకోవడం, తరచుగా ఫోన్లో మాట్లాడుకోవడం ప్రారంభించారు. అలా వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
ఈ క్రమంలో సదరు నకిలీ వ్యోమగామి.. కొన్నాళ్లకు ఆ మహిళకు ప్రపోజ్ చేశాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. సదరు మహిళను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానని.. భూమ్మీదకు రాగానే వివాహం చేసుకుంటానని వెల్లడించాడు. అయితే తాను భూమ్మీదకు తిరిగి రావాలంటే.. భారీగా డబ్బు ఖర్చవుతుందని జపాన్‌కు వెళ్లే రాకెంట్ ల్యాండింగ్ ఫీజు చెల్లించేందుకు డబ్బులు అవసరం అవుతాయని ఆమెను నమ్మించాడు. అతడి మాటలు నిజమని నమ్మిన వృద్ధురాలు.. ఐదు దఫాలుగా.. 4.4 మిలియన్ యెన్‌లు(దాదాపు 24.8లక్షలు) పంపించింది.
అయినా ఇంకా డబ్బులు అడగడంతో అనుమానం వచ్చి.. చివరకు పోలీసులుకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మహిళతో మాట్లాడిన వ్యక్తి ఓ కేటుగాడని.. అసలు అతడు అంతరిక్ష కేంద్రంలో పని చేయడం లేదని వివరించారు. ప్రస్తుతం సదరు కేటుగాడిని పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు. ఇక ఈ కేసుకు.. అంతర్జాతీయ రొమాన్స్ స్కామ్ గా పేరు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు.