అప్పుల భారం తట్టుకోలేక రైతులు, పేద, మధ్యతరగతి మనుషులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు ఇప్పటికే అనేకం చూశాం. కానీ బ్యాంక్ రుణాలు రికవరీ కాకపోవడంతో.. ఓ మేనేజర్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. విషాదం ఏంటంటే.. సదరు మేనేజర్.. అప్పు చేసి ఖాతాదారులు తీసుకున్న రుణాలు చెల్లించాడు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన సదరు బ్యాంక్ మేనేజర్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన యానాంలో చోటు చేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
యానాంకు చెందిన సాయిరత్న శ్రీకాంత్ అనే వ్యక్తి ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం.. శ్రీకాంత్ భార్య.. పిల్లలను స్కూల్ నుంచి తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లింది. అప్పటి వరకు బాగానే ఉన్న శ్రీకాంత్.. భార్య బయటకు వెళ్లగానే.. ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక శ్రీకాంత్ భార్య.. పిల్లలను తీసుకుని వచ్చి డోర్ కొట్టగా స్పందన రాలేదు. ఎంతసేపటికి శ్రీకాంత్ డోర్ తీయకపోవడంతో.. కిటికీలోంచి లోపలికి చూడగా.. శ్రీకాంత్ ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతు కనిపించాడు. దీంతో ఇరుగుపొరుగు సాయంతో తలుపులు పగలగొట్టి.. లోపలికి వెళ్లి.. శ్రీకాంత్‌ను కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
శ్రీకాంత్ పని చేస్తున్న బ్యాంక్‌లో కొందరు ఖాతాదారులు.. రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఈ విషయమై శ్రీకాంత్ మీద పై అధికారులు ఒత్తిడి చేయసాగారు. ఈ క్రమంలో శ్రీకాంత్.. బయట అప్పులు చేసి రూ.60 లక్షల వరకు ఖాతాదారుల అప్పులు అతడే చెల్లించాడు. ఆ తర్వాత యానాంకు బదిలీపై వచ్చాడు. ఇక్కడ కూడా మరో రూ.37లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసిందని పోలీసు అధికారులు వివరించారు. విధి నిర్వహణలో తన భర్త మానసికంగా తీవ్ర ఒత్తిడిలో ఉండేవారని శ్రీకాంత్ భార్య పోలీసులకు తెలిపింది. ఇక సోమవారం రాత్రే శ్రీకాంత్ తనతో అప్పులు తీరిపోయి.. ఆనందంగా గడుపుతామని చెప్పాడని.. కానీ ఇంతలోనే ఇలా జరిగిందని కన్నీటి పర్యంతం అయ్యింది. తనకు, తన బిడ్డలకు దారేవరని వాపోయింది.