ప్రేమలో ఉన్నప్పుడు అమ్మా, నాన్న గుర్తుకు రారు. ప్రేమించిన వారు మోసం చేశారని చనిపోవాలనుకున్నప్పుడూ అమ్మా, నాన్న గుర్తుకు రారు. వాళ్ళేం పాపం చేశారని వారికింత పెద్ద శిక్ష విధిస్తున్నారు. తమ బిడ్డలు ఏ తప్పూ చేయరన్న నమ్మకంతో రోజూ గుండెల మీద చేయి వేసుకుని నిద్రపోతారు. ఎదురింటి వాళ్లకీ, పక్కింటి వాళ్ళకీ.. మా అమ్మాయి/అబ్బాయి చాలా పద్ధతి అని చెప్పుకుని మురిసిపోతుంటారు. కానీ చేసే పనులు మాత్రం తలదించుకునేలా ఉంటాయి. ప్రేమిస్తే ఇంట్లో అమ్మా, నాన్నలని వదిలేసి వెళ్లిపోవాలా? అలా ఎక్కడైనా రాసుందా? అదేమిటో ప్రేమిస్తే ప్రేమించిన వ్యక్తి కోసం చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన అమ్మ, నాన్నలని క్షణం ఆలోచించకుండా వదిలేసి వెళ్ళిపోతారు. అసలు ప్రేమించిన వ్యక్తి ఎలాంటి వాడో, ఏం చేస్తున్నాడో? అమ్మా, నాన్నలని వదిలేసి వెళ్లిపోతున్నా, సరిగా చూసుకుంటాడో? లేదో? ఆలోచించక్కర్లేదా?
అసలు అమ్మ, నాన్నలకి చెప్పకుండా వెళ్లిపోవడం ఏమిటి? వాళ్ళని మించిన స్నేహితులు ఉంటారా? వాళ్లకి చెప్తే పోనిస్తారా? వాళ్లకి చెప్పాలి. అమ్మ, నాన్నలకి తన కూతురు బాగుంటే చూడాలనుకోరా? ప్రేమని అంగీకరించరేమో అని ఇంట్లోంచి వెళ్ళిపోతారు. తీరా ప్రేమించినోడు మోసం చేస్తే లోకాన్నొదిలేసి వెళ్ళిపోతారు. ఇంతేనా జీవితం. ప్రేమించే ముందు వాడు ఎలాంటి వాడు అని ఆరా తీస్తే చనిపోయే పరిస్థితి రాదు కదా. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని షంషీర్ నగర్ కి చెందిన యువతి.. ధరావత్ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించింది. నిజానికి ఈ పోటుగాడే ఆ యువతి చుట్టూ తిరిగి ప్రేమిస్తావా? లేదా? అంటూ వెంటపడ్డాడు. పాపం ఆ యువతి ఈ ప్రేమ, గీమా మనకి సెట్ అవ్వవు అని చెప్పింది. అయినా గానీ బలవంతంగా ఒప్పించాడు. తీరా ప్రేమించడం మొదలుపెట్టాక మృగ బుద్ధి చూపించాడు.
ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని పాపం పిచ్చి పిల్ల.. కనిపెంచిన అమ్మ, నాన్నలని వదిలేసి.. మధ్యలో పరిచయమైన వ్యక్తిని నమ్మి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. ఈ మధ్య విదేశీ సంస్కృతొకటి బాగా ఫేమస్ అయిందేమో.. సహజీవనం చేయడం అంటే డైలీ కాలకృత్యంలా అయిపోయింది. అమ్మ, నాన్నలకి తెలియకుండా రూమ్ తీసుకోవడం, అన్నీ అయిపోయాక లబోదిబోమని ఏడవడం. ఇదొక చిన్న విషయం అని పైగా కబుర్లొకటి. పాపం ఆ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. బయట రూమ్ తీసుకుని సహజీవనం చేశాడు. కానీ పెళ్లి పేరు ఎత్తితే మాత్రం.. 8 నెలల సమయం కావాలన్నాడు. దీంతో ఆ యువతి మోసం చేశాడని గ్రహించి లెటర్ రాసి.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
“ఎందుకురా రాజు.. నేనేం పాపం చేశాను. నువ్వే కలిశావ్. పెళ్లి చేసుకుంటా అని చెప్పావ్. నువ్వే చచ్చిపోతా అని అన్నావ్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా అన్నావ్. పెళ్లి చేసుకుందాం అనే సరికి నా తప్పులన్నీ బయట పెడుతున్నావ్. నేను ముందే చెప్పినా కదా.. నా పరిస్థితి ఇది, నా కథ ఇది అని. అప్పుడు నువ్వే కదా నీ పరిస్థితులతో అవసరం లేదు, నాకు నువ్వు చాలు అని అన్నావ్. ఇప్పుడు మాట మారుస్తున్నావ్. నువ్వు చెప్పినట్టే విన్నా. అయినా తప్పు నాదే అంటున్నావ్. మా అన్నని బతకనియ్యవా అని నీ తమ్ముడంటాడు. నీకు ముందే చెప్పాను.. ఈ లవ్వూ అది మనకి సెట్ అవ్వదు అని. నువ్వేమన్నావ్ ఏం కాదు, కలిసుందాం అని అన్నావ్. పెళ్లి అంటే ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావ్. ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నావ్. ఇప్పుడు నాకు దిక్కెవరు. ఇంట్లో అమ్మ, నాన్నలని వదిలేసి వచ్చాను. నేను చచ్చిపోవడమే నాకు దిక్కు” అని రాసి చనిపోయింది.
ఆడు మగాడు కాబట్టి ప్రేమించమని వెంట పడతాడు. ప్రేమిస్తావా? లేదా? అంటూ నీ చుట్టూ తిరుగుతాడు. జాలి పడి ప్రేమిస్తే ఇక అంతే ఛాప్టర్ క్లోజ్. మంచోడైతే ఓకే కానీ చెడ్డోడు అయితే, అవకాశవాది అయితే ఏంటి పరిస్థితి? అయినా జాలి పడి ప్రేమించడం ఏమిటి? ప్రేమ అంటే ఒక ఎఫెక్షన్. ఏదో జాలి వేసో, దయతలచో ప్రేమించడం కరెక్ట్ కాదు. అతను లేకపోతే బతకలేనేమో అనిపిస్తే అది ప్రేమ. అంతేగానీ వాడు ప్రేమించమని వేధిస్తున్నాడు, వెంట పడుతున్నాడు, సర్లే ప్రేమించేద్దాం ఇది కాదు ప్రేమంటే. వాడిదేం పోయింది. అవసరం తీరాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు. మధ్యలో ప్రేమించినందుకు ఆడపిల్ల జీవితం అన్యాయం అయిపోతుంది. ఆడపిల్ల జీవితమేనా? ఈ యువతిలా ఏ తప్పుడు నిర్ణయమో తీసుకుంటే.. తమ కూతురే సర్వస్వం అని నమ్ముకుని జీవించే తల్లిదండ్రుల జీవితం కూడా అన్యాయం అయిపోతుంది. కాబట్టి అమ్మ, నాన్నల గురించి కూడా ఆలోచించండి. ఈ యువతిలా మాత్రం మోసపోకండి.