వారు ఎన్నో ఆశలతో.. కోటి కలలతో.. కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి.. అత్తారింట్లో అడుగుపెట్టారు. తమ వంశాన్ని అభివృద్ధి చేయడానికి.. తమ జీవితాల్లో వెలుగులు నింపడానికి.. కన్నవారిని సైతం వదిలి వచ్చిన కోడళ్ల పట్ల ప్రేమానురాగాలు పంచి.. తండ్రిలా ఆదరించి.. రక్షించాల్సిన మామ.. వారిపై కక్ష కట్టాడు. కోడళ్ల రూపంలో.. తన ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశించిందని.. నమ్మాడు. దీని గురించి కొడుకులకు చెప్పి.. వారి మైండ్ సెట్ మార్చాడు. ఆ తర్వాత తండ్రికొడుకులు ముగ్గురు కలిసి.. తోటికోడళ్లను అత్యంత పాశవీకంగా హత్య చేశారు. ఈ దారుణం ఆంధ్రప్రదేశ్.. కర్నూలులో చోటు చేసుకుంది. తోటికోడళ్ల మృతితో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓర్వకల్లు నన్నూరు గ్రామానికి చెందిన కురవ మంగమ్మ, పెద్ద గోవర్ధన్ అలియాస్ గోవన్న దంపతులకు పెద్ద రామగోవిందు, రామ గోవిందు అనే ఇద్దరు కుమారులు.. ఓ కుమార్తె సంతానం ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడికి ఏడేళ్ల క్రితం.. గూడురు మండలం, గుడిపాడు గ్రామానికి చెందిన రామేశ్వరమ్మతో వివాహం కాగా.. చిన్న కుమారుడు రామగోవిందు.. ఐదేళ్ల క్రితం.. కల్లూరు మండలం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేణుకను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇక గోవన్నకు గ్రామంలో 40 ఎకరాల వరకు భూమి ఉంది. దాంతో కుటుంబ సభ్యులంతా వ్యవసాయం చేసుకుంటూ.. జీవనం సాగించేవారు.
అయితే చిన్న కోడుకు ప్రేమ వివాహం చేసుకోవడం గోవన్నకు నచ్చలేదు. దాంతో చిన్న కోడలు రేణుక విషయంలో అసంతృప్తిగా ఉండేవాడు. కానీ తోటికోడళ్లు ఇద్దరు మాత్రం.. సొంత అక్కాచెల్లెళ్ల మాదిరి ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కోడళ్లు.. ఇంతలా కలిసిమెలిసి ఉండటం.. గోవన్నకు నచ్చలేదు. దీనికి తోడు.. గోవన్న కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీని గురించి.. నాటు వైద్యుని దగ్గరకు వెళ్లి చూపించగా.. అతడు గోవన్నకు పసరు మందు తాపించాడు. ఆ సమయంలో మందు పడినట్లు.. సదరు నాటు వైద్యుడు గోవన్నకు తెలిపాడు. అంతేకాక.. కోడళ్లే.. గోవన్నకు చేతబడి చేసి.. మందు పెట్టారని.. నాటువైద్యుడు నూరిపోశాడు.
అతడి మాటలు గోవన్న మనసుపై ప్రభావం చూపాయి. దాంతో కోడళ్లపై అనుమానం పెంచుకున్నాడు. దీని గురించి.. కోడులకు చెప్పి.. వారి మనసులో కూడా భార్యల పట్ల ద్వేషం పెంచాడు. దీనికి తోడు.. కుమారులిద్దరికి ఇంకా సంతానం కలగలేదు. దాంతో గోవన్న కొడుకులు కూడా భార్యలను వదిలించుకుని.. మరో వివాహం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. దీనికి తోడు తండ్రి.. కోడళ్ల మీద చాడీలు చెప్పడంతో.. వారు కూడా భార్యలను హత్య చేయాలని భావించారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11 గంటలకు గ్రామంలోని తడకనపల్లె రస్తాలో ఉన్న తమ పొలంలో పని చేసేందుకు గోవన్నతో కలిసి.. కోడళ్లిద్దరూ పనులకు వెళ్లారు. వీరికి తోడుగా పెద రామ గోవిందు కూడా వెళ్లాడు.
పొలం పనులు ముగిశాక.. పశువులకు మేత కొసుకురమ్మని గోవన్న కోడళ్లను ఆదేశించాడు. దాంతో వారిద్దరూ వెళ్లి గడ్డి కోయసాగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో.. అప్పటికే ప్లాన్ చేసుకున్న ప్రకారం.. గోవన్న, అతడి పెద్ద కుమారుడు రామ గోవిందు.. గడ్డి కోస్తున్న తోటికోడళ్ల వద్దకు వెళ్లారు. ఆ తర్వాత.. వేపకర్ర తీసుకుని.. పెద్ద కోడలు రామేశ్వరమ్మ తలపై బలంగా కొట్టగా.. ఆమె అక్కడికక్కడే పడిపోయింది. ఇది గమనించిన చిన్న కోడలు రేణుక.. మావ, బావను అడ్డుకోవాలని ప్రయత్నించగా.. అదే కర్రతో ఆమె ఛాతిపై బలంగా కొట్టారు. దాంతో.. రేణుక కూడా అక్కడే కుప్పకూలింది. ఈ ఘటనలో తోటికోడళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
వారు చనిపోయాని నిర్ధారించుకున్న తండ్రి, కొడుకులు.. ఇంటికి వెళ్లి స్నానాలు చేసి.. దుస్తులు మార్చుకుని.. ఏం జరగనట్లే.. తిరిగి పొలం దగ్గరకు వెళ్తారు. ఆ తర్వాత డ్రామా ప్రారంభించారు. తమ భార్యలు చనిపోయినట్లు.. గోవన్న కుమారులు.. అత్తమామలకు సమాచారం అందించారు. ఇక గోవన్న ఎవరికి అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో.. వెళ్లి ఆస్పత్రిలో చేరతాడు. విషయం తెలుసుకున్న తోటికోడళ్ల తల్లిదండ్రులు.. సంఘటనా స్థలానికి చేరుకుని.. కుమార్తెల మృతదేహాలను చూసి.. గుండలవిసేలా విలపిస్తారు. ఇక స్థానికులు సమాచారంతో.. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుంటారు.
అయితే సంఘటనా స్థలంలో పోలీసులకు ఎలాంటి ఆధారాలు, క్లూలు లభించలేదు. అయితే గోవన్న ఆస్పత్రిలో చేరడంతో.. పోలీసులకు అనుమానం వస్తుంది. దాంతో గోవన్నతోపాటు.. అతడి కుమారులు పెద రామగోవిందు, రామగోవిందులను అదుపులోకి తీసుకుని.. విచారించగా.. వారు చేసిన దారుణం గురించి వెల్లడించారు. కుమారుల సాయంతో.. తానే తోటికోడళ్లను చంపినట్లు.. గోవన్న అంగీకరించాడు. దాంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అలానే గోవన్నకు వైద్యం చేసి.. చేతబడి చేశారంటూ అనుమానం రేకెత్తించిన నాటు వైద్యుడిని కూడా పోలీలసులు అదుపులోకి తీసుకున్నారు. తోటి కోడళ్ల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూఢనమ్మకాలతో కోడళ్లను బలి చేసిన ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.