బంగారం అంటే ఇష్టం లేని వారు దాదాపుగా భారతదేశంలో ఎవరు ఉండరు. ఆభరణంగానే కాక.. ఆదాయ వనరుగా కూడా ఉపయోగపడుతుందని భావిస్తారు. అయితే పెరుగుతున్న ధరతో పసిడి కొనాలంటేనే భయపడుతున్నారు జనాలు. వారికి ఊరట కలిగిస్తూ.. నేడు బంగారం ధర దిగి వచ్చింది. ఆ వివరాలు..
బంగారం కొనాలని ఉన్నా.. పెరుగుతున్న రేట్లను చూస్తే భయం వేస్తోంది. మే నెలలో వివాహాలు ప్రారంభం కానున్నాయి. ఇక పెళ్లి అంటే తప్పకుండా బంగారం కొనాల్సిందే. మరి రేటు చూస్తేనేమో.. ఎక్కడో ఆకాశంలో ఉంది.. ఎలా అని బాధ పడుతున్న వారికి.. శనివారం భారీ ఊరట లభించింది. పైపైకి దూసుకుపోతున్న పసిడి ధర.. నేడు దిగి వచ్చింది. పడిపోతున్న పసిడి రేటు చూసి సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరి నేడు బంగారం ధర ఎంత తగ్గింది.. హైదరాబాద్, ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ రేటు ఎంత ఉంది అంటే..
దేశీయంగా బంగారం, వెండి ధరలు పడిపోయి.. కొనేవారికి కాస్త ఊరట కలిగించింది. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ200 పడిపోయి.. రూ.55,750 వద్ద కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ మేలిమి బంగారం ధర హైదరాబాద్‌లో 10 గ్రాముల మీద రూ.220 తగ్గి రూ.60,820 వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో చూస్తే 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ. 200 పడిపోయి రూ.55,900 వద్ద ఉండగా.. ఇదే 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా రూ.220 పతనమై.. రూ.60,970 వద్ద కొనసాగుతోంది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే.. దిగివస్తోంది. నేడు హస్తినలో కిలో వెండి ధర రూ.300 పడిపోగా.. ప్రస్తుతం రూ.76,200 వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్ మార్కెట్ విషయానికి వస్తే.. కిలో వెండి రూ.200 పతనం అయ్యి.. 80 వేల వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ రేటు ఔన్సు ధర ప్రస్తుతం 1990 డాలర్లకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు కూడా పడిపోయి.. ఇప్పుడు 25 డాలర్ల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక భవిష్యత్తులో బంగారం, వెండి ధరలు అనేవి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లపై ఆధారపడే ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. సాధారణంగా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. బంగారం ధరలు పడిపోతుంటాయి.