మన దేశంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడమే కాక.. దేశానికి అన్నం పెడుతున్న రంగం వ్యవసాయం. మన దేశంలో వ్యవసాయాన్ని జూదంతో పోలుస్తారు. అవును మరి.. నేల తల్లి మీద అమితమైన ప్రేమతో.. పండించే పంటను సొంత బిడ్డలా కాపాడుకుంటాడు రైతు. తీరా పంట చేతికి వచ్చి.. నాలుగు రూపాయలు మిగులుతాయనుకునే వేళ.. ప్రకృతి అయినా నష్టం కలిగిస్తుంది.. లేదా.. ప్రభుత్వాలు సరైన మద్దతు ధర కల్పించడంలో విఫలం అయ్యి.. రైతలకు తీరని అన్యాయం చేస్తాయి. అటు ప్రకృతి, ఇటు ప్రభుత్వాలు తనను మోసం చేస్తున్నా.. అన్నదాతలు మాత్రం.. ప్రతి ఏడాది.. మరింత విశ్వాసం, నమ్మకంతో పంటలు పండించేందుకు రెడీ అవుతారు.
అయితే వ్యవసాయం చేయడం ఎంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దుక్కి దున్నేది మొదలు.. పంటను అమ్మే వరకు డబ్బులతోనే మొత్తం నడుస్తుంది. చాలా మంది రైతులు పెట్టుబడి కోసం బంగారం తనఖా పెట్టడం, లేదంటే.. వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పు తీసుకోవడం చేస్తారు. అయితే ప్రభుత్వ రంగ బ్యాంకులు తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు మంజూరు చేస్తాయి. తాజాగా దేశంలోనే రెండో పెద్ద బ్యాంకుగా గుర్తింపు పొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నదాతలకు శుభవార్త చెప్పింది. తక్కువ వడ్డీకే లోన్ ఇవ్వడమే కాక.. వెంటనే ఆ మొత్తాన్ని మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. ఆ వివరాలు..
రైతులు, వ్యవసాయ వ్యవస్థాపకుల స్వల్ప కాలిక ఉత్పత్తి అవసరాలు తీర్చడం ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ లోన్ పథకాన్ని తీసుకువచ్చింది. దీని ద్వారా రైతులు, పంట ఉత్పత్తిలో భాగస్వాములైన వారికి ఫైనాన్స్ అందిచనుంది. అంతేకాక వ్యవసాయ భూమిని అభివృద్ధి చేసుకోవాలని భావించేవారికి, వ్యవసాయానికి సంబంధించిన పరికరాలను కొనాలనుకునేవారికి, తోటలకు సాగు నీరు అందించాలనుకునే వారికి ఈ పథకం ద్వారా రుణం మంజూరు చేయనుంది. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.
‘‘మీ వ్యాపార అవసరాలు తీర్చుకోవడం కోసం ఒకే వేదిక. మీ వ్యవసాయ కలలను సాకారం చేసుకోవడం కోసం ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ లోన్‌లో భాగస్వాములు కండి. ఈ రోజే మీకు దగ్గరలోని బ్రాంచ్‌ను సందర్శించండి. తక్కువ వడ్డీకే లభించే రుణాలు, తక్షణమే చేతికి అందే రుణ మొత్తం గురించి తెలుసుకొండి’’ అంటూ ఎస్‌బీఐ ఓ ట్వీట్ చేసింది.
ఇక ఎస్‌బీఐ అగ్రి గోల్డ్ లోన్ పొందాలనుకునే వారు.. బంగారాన్ని సెక్యూరిటీగా పెట్టాలి. అలానే రుణం మంజురైన నాటి నుంచి 12 నెలల లోపు దాన్ని తిరిగి చెల్లించాలి. అన్నదాతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బ్యాంకు సూచించింది.