కారు కొనాలనేది చాలా మందికి ఒక కల. ఎప్పటికైనా తాము ఆశపడిన కారును కొనుగోలు చేయాలని కలలు కంటూ ఉంటారు. ప్రస్తుతం అయితే కార్ల మీద ఫెస్టివ్ సీజన్ ఆఫర్లు, దసరా, దీపావళి అంటూ బోలెడు ఆఫర్లు నడుస్తున్నాయి. కంపెనీ ఇచ్చే డిస్కౌంట్స్, డీలర్లు ఇచ్చే అదనపు ప్రయోజనాలు ఇలా చాలా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడూ ఉండే ఆఫర్లేలే అని లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే మీ కలల కారును ఇప్పుడు కొనుక్కోలేకపోతే ముందునాటికి అది మరింత భారం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. మీరు కోరుకున్న కారును ఇప్పుడు కాకపోతే వచ్చేరోజుల్లో కొనడం ఇంకా కాస్ట్లీగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే త్వరలోనే అన్ని కంపెనీలకు చెందిన కొత్త కార్ల ధరలు మరింత పెరగనున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. అయితే ఇది కంపెనీలు లాభాల కోసం పెంచుతున్నవి కాదు. కేంద్రం తీసుకొచ్చిన కొత్త కర్బన ఉద్గారాల నిబంధనల దృష్ట్యా ఈ ధరలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది నుంచి కర్బన ఉద్గారాల నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కొత్త కార్లు అన్నీ బీఎస్-6 కార్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నుంచి బీఎస్-6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా కార్లను తయారు చేయాల్సి ఉంటుంది. కర్బన ఉద్గారాల నింబధనల అమలులో కంపెనీలు అలసత్వం ప్రదర్శించ కూడాదు. ప్రస్తుతం కంపెనీలు అన్నీ ఈ బీఎస్6 స్టేజ్ 2 నిబంధన విషయంలో పనిచేస్తున్నాయి. ఒకసారి కంపెనీలు అందుకు అనుగుణంగా కార్లను తయారు చేయడం ప్రారంభించాక అటోమేటిక్‌గా కార్ల ధరలు పెరగుతాయి.
ఈ కొత్త నిబంధనలకు మారేందుకు కంపెనీలు కార్ల ఇంజిన్, డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కారు యొక్క సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్‌లోనూ మార్పులు చేయాలి. అందుకు తగినట్లుగా కంపెనీలు చర్యలు ఇప్పటికే ప్రారంభించాయి. ఈ బీఎస్6 స్టేజ్2 కార్లలో కర్బన ఉద్గారాల మానిటరింగ్ కోసం కొంత ఎక్విప్మెంట్, సాఫ్ట్ వేర్‌ని ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అవి మీ కారు నుంచి ఉత్పత్తి అవుతున్న కర్బన ఉద్గారాలను పర్యవేక్షిస్తుంటుంది. కారు నుంచి ఎక్కువగా కర్బన ఉద్గారాలు విడుదల అవుతూ ఉంటే కారు సర్వీసింగ్ చేయించాలని మీకు అలర్ట్ ని కూడా ఇస్తుంది. బీఎస్ 4 నుంచి బీఎస్ 6లోకి మారినప్పుడు ఎలా అయితే కార్ల ధరలు పెరిగాయో.. అలాగే ఇప్పుడు బీఎస్ 6 నుంచి బీఎస్ 6 స్టేజ్ 2కి మారినప్పుడు కార్ల ధరలు అలాగే పెరగనున్నాయి.