మారుతున్న జీవనశైలి, సాంకేతికంగా సాధిస్తున్న అభివృద్ధి, కేంద్రం తీసుకొస్తున్న అవగాహనల దృష్ట్యా ఇప్పుడు బ్యాంకు ఖాతాలు లేనివారు దాదాపుగా లేరనే చెప్పాలి. సేవింగ్స్ అకౌంట్లు, కరంట్ అకౌంట్లు ఇలా బ్యాంకుల్లో చాలా రకాల ఖాతాలు ఉంటాయి. మీ అవసరాన్ని బట్టి మీరు మీకు నచ్చిన బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేస్తారు. మీ దగ్గరున్న డబ్బును బ్యాంకులో దాచుకోవడం, అవసరం అయినప్పుడు డెబిట్ కార్డు ద్వారా డ్రా చేసుకోవడం చేస్తుంటారు. కొందరికి వారి సిబిల్ స్కోర్‌ని బట్టి క్రెడిట్ కార్డులు కూడా వస్తుంటాయి. వాటికి మళ్లీ అదనపు ఛార్జీలు వసూలు చేస్తారు. సేవింగ్స్ అకౌంట్లకు కూడా లావాదేవీలను బట్టి సేవా రుసుము, ఛార్జీలు వసూలు చేస్తుంటారు. మరి.. ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉండాలి? ఒకటి కంటే ఎక్కువ ఉంటే మీకు నష్టమా? లాభమా? ఎప్పుడన్నా ఆలోచించారా? ఇప్పుడు తెలుసుకోండి.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఇన్ని ఖాతాలే కలిగి ఉండాలని ఏమీ లేదు. ఒక వినియోగదారుడు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉండటం తప్పేం కాదు. అతనికి నచ్చిన బ్యాంకులో ఖాతా ఓపెన్ చేయవచ్చు. కానీ, అలా ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉండటం వినియోగదారులకు మంచిదేనా? నష్టం ఉండదా అంటే.. లాభం కంటే నష్టమే ఎక్కువని చెప్పాలి. అవును.. అంటే ఆర్బీఐ పరంగా ఎలాంటి నష్టం లేకపోయినా మీకు బ్యాంకుల నుంచి నష్టం కలగచ్చు. అంటే ప్రతి బ్యాంకులు ఇప్పుడు మినిమం బ్యాలన్స్ ఉంచుకోవాలని నిబంధన తీసుకొచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు అయితే వేలల్లో నగదు ఖాతాలో ఉంచాలంటూ కోరుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు సైతం మినిమం బ్యాలెన్స్ ఉండాలని చెబుతున్నాయి.
అంటే మీకు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉంటే మీరు మినిమం బ్యాలెన్స్ కోసమే వేలల్లో ఖర్చు చేయాలి. అంతేకాకుండా బ్యాంకులు చెప్పినట్లు మినిమం బ్యాలెన్స్ లేకుండా ఉంటే మీకు ఫైన్ పడుతుంది. అంటే ఒక్క ఫైన్‌తో ఆగకుండా దానివల్ల మీ సిబిల్ స్కోర్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఎక్కువ బ్యాంకు ఖాతాలుంటే ఎక్కువ డెబిట్ కార్డులు, ఎక్కువడ క్రెడిట్ కార్డులు కూడా ఉంటాయి. వాటికి మళ్లీ ఛార్జెస్, సేవా పన్నులు, వార్షిక ఫీజు అంటూ ఇంకా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది. మీ సిబిల్ స్కోర్ దెబ్బతింటే మీకు లోన్ల విషయంలో చాలా ఇబ్బందులు కలగవచ్చు. ఇలా మీరు మినిమం బ్యాలెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డులు అంటూ చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. అందుకే అనవసరంగా ఉన్న బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేయడమే మేలని ఆర్థిక నిపుణులు సూచిస్తూ ఉంటారు.