ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ప్రజలకు సెప్టెంబర్ నెల ప్రారంభంలోనే భారీ ఊరట లభించింది. చమురు కంపెనీలు వినియోగదారులకు భారీ శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. 19 కేజీల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ రేటును రూ.91.5 తగ్గించాయి. గ్యాస్ కంపెనీల నిర్ణయంతో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1885గా ఉండగా.., ముంబయిలో రూ.1884కు, హైదరాబాద్‌లో రూ.2099.5కు చేరాయి. తగ్గించిన ధరలు నేటి(గురువారం) నుంచే అమలులోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. ఇక మే 19 నుంచి వాణిజ్య సిలిండర్ ధర 5వ సారి తగ్గింది. కానీ డొమెస్టిక్ సిలిండర్ ధర మాత్రం అలానే ఉంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా గత కొన్ని రోజులుగా ముడి చమురు ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ల ధరలు ఇప్పటికే అనేక సార్లు పెరిగాయి. ప్రస్తుతం ముడిచమురు ధర తగ్గడం ప్రారంభించడంతో దానితో ముడిపడ్డి ఉన్న ఉత్పత్తుల ధర కూడా తగ్గుముఖం పట్టింది. తాజాగా గ్యాస్ కంపెనీలు తగ్గించిన ధరల ప్రభావం టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లుపై ఉండనుంది. మరి తగ్గించిన ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.