బ్యాంకులు తమ కస్టమర్లను ఆకర్షించడానికి పలు ఆఫర్లను పెడుతుంటాయి. డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల ద్వారా లావాదేవీలు జరిపితే క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లు ఇస్తుంటాయి. ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్, మల్టీప్లెక్స్ థియేటర్స్, రెస్టారెంట్స్ వంటి పలు వ్యాపార సంస్థలతో టయ్యప్ అయ్యి వినియోగదారుల కోసం ఆఫర్లను ఇస్తుంటాయి. పలానా మల్టీప్లెక్స్ థియేటర్ లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా ఒక టికెట్ కొంటే మరొక టికెట్ ఉచితం అనో, పలానా రెస్టారెంట్ లో డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు స్వైప్ చేస్తే ఇంత తగ్గింపు అనో ఆఫర్లు ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఎక్కడ వ్యాపారం బాగా జరిగితే.. ఎక్కడ జన రద్దీ ఉంటుందో అక్కడ బ్యాంకులు వాలిపోతుంటాయి. ఆ వ్యాపార సంస్ధలతో టయ్యప్ అయిపోతుంటాయి.
ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంకు తమ ఖాతాదారులను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లను ప్రకటించింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ మరియు బెస్ట్ హాలిడే డెస్టినేషన్ స్పాట్ అయిన రామోజీ ఫిల్మ్ సిటీతో ఐసీఐసీఐ బ్యాంకు టయ్యప్ అయ్యింది. 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీగా ప్రఖ్యాతి గాంచింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఫిల్మ్ స్టూడియోగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న రామోజీ ఫిల్మ్ సిటీతో టయ్యప్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ సందర్భంగా ఐసీఐసీఐ వినియోగదారులకు డిస్కౌంట్లను అందిస్తోంది.
రామోజీ ఫిల్మ్ సిటీ లోపల ఉన్న అన్ని హోటల్స్ లో ఏ హోటల్ లో బస చేసినా, ఏ హోటల్ లో తిన్నా 10 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. అంతేకాదు ఎంట్రీ టికెట్ మీద రూ. 100 ఫ్లాట్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు. గరిష్టంగా 20 ఎంట్రీ టికెట్ల వరకూ ఈ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. అయితే ఈ డిస్కౌంట్ పొందాలంటే ఐసీఐసీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా మాత్రమే లావాదేవీలు జరపాలి. ఈ ఆఫర్ ఈ నెల 15 నుంచి అందుబాటులోకి వస్తుంది.