ఫెస్టివల్ బొనాన్జా, దసరా ఆఫర్, దీపావళి ఆఫర్లు అంటూ రోజూ ఆన్‌లైన్‌లో చూస్తూనే ఉంటారు. ఈ పండగకి ఈ ఆఫర్ ఉంది. ఈ వస్తువుపై ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాం, మంచి తరుణం మించిన దొరకదు అంటూ చాలా ప్రచారాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇ-కామర్స్ సైట్లలో షాపింగ్ చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే బయట మార్కెట్ కంటే వాళ్లకు అక్కడ ఎక్కువ ఆఫర్లు, తక్కువ ధరకే వస్తువులు దొరుకుతున్నాయని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఫెస్టివల్ ఆఫర్లు, స్పెషల్ అకేషన్ ఉన్న రోజుల్లోనే వస్తువులను కొంటూ ఉంటారు. అలా పండగలకు ఇచ్చే ఆఫర్లలో మీకు బాగా వినిపించే పేరు ‘నో కాస్ట్ ఈఎంఐ’ కూడా ఒకటి. అవును ఇందులో మోసం ఏముంది? మంచి ఆఫరే కదా అనుకుంటున్నారా? అయితే అసలు దానివల్ల మీరు లాభ పడుతున్నారా? నష్టపోతున్నారా? చూద్దాం.
అన్ని పండగ ఆఫర్ల సమయంలో ఫలానా వస్తువుపై మీకు నో కాస్ట్ ఈఎంఐ సదుఫాయం ఉంది. అని చెబుతుంటారు. అసలు నో కాస్ట్ ఈఎంఐ అంటే.. మీరు కొనే వస్తువుపై అదనంగా ఎలాంటి ఛార్జీలు, రుసుము చెల్లించాల్సిన అవసరం లేదనమాట. ఉదాహరణకు అఖిల్ నో కాస్ట్ ఈఎంఐ కింద రూ.20 వేలకు ఒక సెల్‌ఫోన్ కొన్నాడు. దానిని 10 నెలలకు ఈఎంఐ పెట్టుకున్నాడు. అంటే అప్పుడు అఖిల్ నెలకు రూ.2 వేలు చొప్పున తన ఈఎంఐ చెల్లించవచ్చు. అదనంగా ఎలాంటి ఛార్జెస్, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. అంటే మీరు తీసుకున్న సెల్‌ఫోన్‌ని కట్టాల్సిన మొత్తాన్ని 10 నెలలు వాయిదాల్లో చెల్లించినా కూడా మీకు ఎలాంటి అదనపు ఖర్చు లేదనమాట. అంటే ఇది చాలా గొప్ప ఆఫర్ కదా? అంటే ఆర్థిక నిపుణులు, ఇ-కామర్స్ బిజినెస్ గురించి బాగా తెలిసిన వాళ్లు కాదనే చెబుతున్నారు.
అదేంటి ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా మనకు మంచి మొబైల్ వస్తోంది. అందులో మతలపు ఏముంది? అనేగా మీ అనుమానం. అవును అందులోనే మతలబు ఉంది మరి. ఈ నో కాస్ట్ ఈఎంఐ విధానంలో అఖిల్ మొబైల్ రూ.20 వేలకు కొన్నాడు. దానిని 10 నెలల వాయిదాల్లో చెల్లించాడు. అయితే నిజానికి ఎలాంటి ఆఫర్ లేని సమయంలో ఆ మొబైల్ ధర రూ.17 వేలు మాత్రమే ఉంటుంది. కానీ, దాని ధరను 3 వేలకు పెంచి ఆ తర్వాత నో కాస్ట్ ఈఎంఐగా చూపించి మీతో వడ్డీ, ఈఎంఐ ఛార్జెస్ అన్నింటినీ కట్టిస్తున్నారు. ఇంకొన్నిసార్లు.. నో కాస్ట్ ఈఎంఐపై కూడా ఛార్జెస్ వసూలు చేస్తారు. వాటిని ఈఎంఐగా మలిచినందుకు వేసే ఛార్జెస్‌గా చెబుతారు. కానీ, వాస్తవానికి అవి మీరు తీసుకునే ఈఎంఐకి వడ్డీ అనమాట. ఆ విధంగా వినియోగదారులు నో కాస్ట్ ఈఎంఐ అనే మాయలో పడి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.