ఫేస్‌బుక్.. ప్రస్తుతం ప్రపంచంలోనే టాప్ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌గా కొనసాగుతోంది. ఎవరికైనా ఫేస్‌బుక్ అకౌంట్ ఉన్నా లేకపోయినా.. అసలు ఫేస్‌బుక్ అంటే ఏంటో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. మెటాగా మారిన తర్వాత ఈ సోషల్ ప్లాట్‌ఫామ్స్ మరింత మందికి చేరువయ్యాయి. అయితే ఈ సోషల్ ప్లాట్ ఫామ్లు వాడటం వల్ల లాభాలేంటి? వాటి వల్ల మనకు ఏదైనా ముప్పు ఉందా? ఇలాంటి ప్రశ్నలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ప్రశ్నలకు చాలా మందికి సమాధానం కూడా తెలియకపోవచ్చు. అయితే పరుగులు పెడుతున్న టెక్నాలజీ దృష్ట్యా ఇప్పుడు ఏ సోషల్ ప్లాట్ ఫామ్, ఏ స్మార్ట్ గాడ్జెట్ వాడుతున్న మన వ్యక్తిగత సమాచారం గోప్యంగానే ఉంటుంది, హ్యాకర్ల చేతిలో పడదు అని ఎవరూ చెప్పలేరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మన సమాచారం వేరే వారికి చేరే అవకాశం లేకపోలేదు.
ఇప్పుడు ఫేస్‌బుక్ యూజర్లు కూడా ఇప్పుడు అలాంటి ప్రమాదంలో ఉన్నారు. అయితే ఈ విషయం ఎవరో చెప్పడం లేదు. స్వయంగా ఫేస్‌బుక్ సంస్థ వాళ్లే తమ 10 లక్షలకుపైగా యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. మీ ఖాతాలు, మీ వ్యక్తిగత సమాచారం కోల్పోకుండా జాగ్రత్త పడండి అంటూ వార్న్ చేస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. ఫేస్‌బుక్ యూజర్లకు ప్రమాదం కలిగించేలా వారి వ్యక్తిగత సమాచారం చోరీ చేసేందుకు వీలుగా ఉన్న 400కు పైగా ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్‌లను మెటా రీసెర్చెర్స్ కనుగొన్నట్లు వెల్లడించారు. వాటివల్ల తమ యూజర్ల వీడియో గేమ్స్, ఫొటో ఎడిటర్, బిజినెస్, వీపీఎన్ వంటి సర్వీసుల పేరిట ఈ యాప్స్ ఉన్నట్లు చెబుతున్నారు. వాటి ముసుగులో ఫేస్‌బుక్ యూజర్లను బోల్తా కొట్టిస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు. ఆ యాప్స్ డౌన్లోడ్ చేశాక ఫేస్‌బుక్ లాగిన్ ఐడీ, పాస్‌వార్డ్ అడుగుతున్నట్లు తెలిపారు. వారి వివరాలతో లాగిన్ అయితే మొత్తం డేటా పోతుందని చెబుతున్నారు.
అయితే నిబంధనలకు అనుగుణంగా పనిచేసే కొన్ని యాప్స్, గేమ్స్ సైతం ఫేస్‌బుక్ లాగిన్ అడుగుతాయి. అలాంటి వాటితో ఎలాంటి ఇబ్బంది ఉండదంటున్నారు. నిజానికి చాలా యాప్స్ ఇప్పుడు అలా ఫేస్‌బుక్ లాగిన్ అడుగుతున్నాయి. కానీ, కొన్ని యాప్స్ మాత్రం మాల్‌వేర్ కిలిగి ఉంటున్నాయి. అవి అసలైన యాప్స్ లాగానే కనిపిస్తాయి. వాటి మధ్య తేడాని గుర్తించడం కూడా చాలా కష్టం అంటున్నారు నిపుణులు. పదే పదే లాగిన్ అడిగినా, యాప్ పనితీరుపై మీకు అనుమానం ఉన్నా వెంటనే ఆ యాప్‌ని అన్ ఇన్‌స్టాల్ చేయాల్సిందిగా చెబుతున్నారు. కొన్ని యాప్స్ డౌన్లోడ్ చేసుకునే ముందే వారి పూర్తి సమాచారం చదివి జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ డౌన్లోడ్ చేశాక అనుమానం వస్తే వెంటనే ఆ యాప్‌ని అన్ ఇన్‌స్టాల్ చేయాలి. అంతేకాకుండా అప్పటికే మీ ఫేస్‌బుక్ అకౌంట్ డీటెయిల్స్ తో లాగిన్ అయ్యి ఉంటే పాస్‌వర్డ్ మార్చుకోవాలి. టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఆన్ చేసుకోవాలి.