సిటీలో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? మీకు నెలకు రూ. 30 వేలు జీతం వస్తే కనుక మీ సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. అదెలాగో చూసేయండి.
నెలకు 30 వేలు సంపాదిస్తున్నారా? అయితే మీరు సొంత ఇల్లు కట్టుకోవచ్చు. మీకు ఎటువంటి అప్పులు లేకపోతే సులువుగా మీరు సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు. నెలకు రూ. 30 వేలు అంటే ఏడాదికి రూ. 3,60,000. ఈ ఆదాయం చాలు, మీరు ఇల్లు కట్టుకోవాలి అనుకోవడానికి. మీ సంపాదనలో ఇంటి అద్దెకు ఒక రూ. 7 వేలు, ఇంటి ఖర్చులకు రూ. 8 వేలు మొత్తం రూ. 15 వేలు తీసేస్తే కనుక రూ. 15 వేలు మిగులుతాయి. ఈ రూ. 15 వేలను ఈఎంఐగా కట్టుకుంటే సొంత ఇంటి కల నిజమవుతుంది. సొంత ఊర్లో స్థలం కొని ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్న ఒక రూ. 25 లక్షలు అవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద రూ. 2,67,280 సబ్సిడీ లభిస్తుంది. అప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మీకు అయ్యే ఖర్చు 22 లక్షలే.
ఏదో ఒక బ్యాంకులో రూ. 22 లక్షలకు లోన్ పెట్టుకుంటే.. నెలకు రూ. 15 వేలు ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. 30 ఏళ్ళు లోన్ పీరియడ్ అయితే నెలకు మీరు కట్టాల్సిన ఈఎంఐ రూ. 15 వేలు అవుతుంది. ఆ విధంగా మీరు మీ సొంత ఊరిలో ఇంటిని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఇల్లు ఇంట్లో ఆడవారి పేరు మీద ఉంటే ఈ పథకం వర్తిస్తుంది. ఇదే లోన్ ద్వారా మీరు హైదరాబాద్ లో ఫ్లాట్ సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్ లో 1 బీహెచ్కే ఫ్లాట్ కొనాలంటే కనీసం రూ. 30 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. సిటీకి కొంచెం దూరంగా అంటే బీరంగూడ, కిష్టారెడ్డిపేట వంటి ఏరియాల్లో రూ. 30 లక్షలకే 2 బీహెచ్కే ఫ్లాట్ వస్తుంది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఫ్లాట్ కొనుగోలు చేసినా సరే సబ్సిడీ లభిస్తుంది.
ఫ్లాట్ కొనడం వల్ల ఇంటి అద్దె రూ. 8 వేలు ఆదా అవుతుంది. ఈ రూ. 8 వేలు కూడా రూ. 15 వేల ఈఎంఐకి యాడ్ చేసి మొత్తం రూ. 23 వేలు ఈఎంఐ కడితే త్వరగా లోన్ క్లియర్ అవుతుంది. హైదరాబాద్ లో ఫ్లాట్ కాకుండా ఇల్లే కావాలనుకుంటే కనుక మీరు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవచ్చు. అలా అయితే చాలా ఖర్చు అవుతుంది. ఉదాహరణకు బాచుపల్లిలో స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే కనుక చదరపు అడుగుకు సగటున రూ. 5,500 అవుతుంది. 322 చదరపు అడుగుల్లో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే స్థలానికి రూ. 18 లక్షలు అవుతుంది. నిర్మాణానికి రూ. 20 లక్షలు అనుకుంటే మొత్తం మీద రూ. 38 లక్షలు అవుతుంది. ముందు రూ. 18 లక్షలకు స్థలం కొనుగోలు చేయండి. అప్పుడు నెలకు రూ. 13,840 ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఎప్పుడూ రూ. 30 వేల జీతమే ఉండదు కదా. జీతం ఇంకో 5 వేలో, పది వేలో పెరుగుతుంది కదా. అప్పుడు స్థలం డాక్యుమెంట్స్ పెట్టి ఋణం అనేది తీసుకోవచ్చు. చిన్నగా ఇంటి పనులు ప్రారంభించుకోవచ్చు. మీ జీతం పెరిగినప్పుడల్లా ఋణ పరిమితి పెంచుకుంటూ ఇల్లు పూర్తి చేసుకోవచ్చు. ఇలా మీరు మీ సొంతింటి కలను నిజం చేసుకోవచ్చు.