చాలా మందికి ఉద్యోగం చేయడం కంటే వ్యాపారం చేయడం ఆసక్తిగా ఉంటుంది. కానీ, వారికి ఆర్థిక ఇబ్బందులు, పెట్టుబడి సమస్యల వల్ల వ్యాపారం జోలికి పోరు. అలాంటి వారికోసం కేంద్రం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. చిన్న మొత్తంలో ఎలాంటి హామీ లేకుండా రుణాన్ని ఇస్తోంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.
ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగం చేసేకంటే వ్యాపారాలు చేస్తే బావుంటుందని అనుకుంటున్నారు. అందుకు తగిన ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. అయితే ఆర్థక ఇబ్బందుల కారణంగా చాలా మంది ఈ వ్యాపారం ఆలోచనలను ముందుకు తీసుకెళ్లరు. ఇంకొంత మంది వ్యాపారానికి లోన్ కోసం ఎదురుచూస్తుంటారు. వ్యాపారాన్ని అభివృద్ధి చేసేందుకు పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికోసం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక పథకాన్ని తీసుకొచ్చాం. ఇందులో మీకు 0 వడ్డీతో రూ.3 లక్షల వరకు లోన్ పొందవచ్చు. పైగా ఇందులో 50 శాతం వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే ఆ లోన్ ఏంటి? ఎవరు అప్లై చేసుకోవచ్చు? ఎవరికి సబ్సిడీ లభిస్తుంది? అనే వివరాలను తెలుసుకుందాం.
ఈ లోన్ పథకాన్ని కేంద్రం 2020లోనే ప్రారంభించింది. అయితే ఇది అందరికీ ఇచ్చే లోన్ కాదు. దీనిని కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు. ఈ పథకం పేరు ఉద్యోగిని. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్న వారు దానిని డెవలప్ చేసుకునేందుకు, కొత్తగా వ్యాపారం చేసే ఆలోచన ఉన్న వారు ఈ ఉద్యోగిని పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు మీరు మీ దగ్గర్లో ఉన్న ఏ బ్యాంకుకైనా వెళ్లి అప్లై చేసుకోవచ్చు. ఇందుకు మీరు ఎలాంటి హామీని కూడా చూపించాల్సిన అవసరం లేదు. మీకు రూ.3 లక్షల వరకు రుణం లభిస్తుంది.
ఈ పథకానికి కేవలం మహిళలు మాత్రమే అర్హులు. వారిలో కూడా 25 నుంచి 55 ఏళ్ల వయసు ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి. వారికి ఇప్పటికే ఏదైనా వ్యాపారం ఉండాలి. లేదా ఒక వ్యాపారం చేయాలి అనే ఆలోచన, ప్రణాళిక ఉండాలి. ఇందులో 88 రకాల వరకు వ్యాపారల కోసం మీరు లోన్ తీసుకోవచ్చు. ఆ వివరాలను బ్యాంకులు కూడా వివరిస్తాయి. ఈ లోన్ కోసం మీరు ఒక 6 రోజుల ఎంటర్ పెన్యూర్ షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకోవాలి. అది పూర్తి చేస్తేనే ఈ లోన్ ఇస్తారు. పైగా మీ సిబిల్ స్కోర్ బాగుండాలి. గతంలో ఏవైనా లోన్స్ తీసుకుని ఎగవేసిన వారు అనర్హులు.
ఈ పథకంలో జీరో వడ్డీ, సబ్సిడీ అందరికీ ఇవ్వరు. ఎస్సీ, ఎస్టీ, హ్యాండీక్యాప్డ్ మహిళలకు మాత్రమే ఈ సున్నా వడ్డీ లభిస్తుంది. మిగిలిన వారు బ్యాంకుల రూల్స్ ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే సబ్సిడీ వితంతువు, హ్యాండీక్యాప్డ్ మహిళలకు 30 శాతం వరకు సబ్సిడీ లభిస్తుంది. మీరు కట్టాల్సిన రుణంలో 30 శాతం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఎస్సీ, ఎస్టీ మహిళలకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. అయితే ఆ కుటుంబం వార్షిక ఆదాయం రూ.2 లక్షల కంటే తక్కువగా ఉండాలి. రూ.3 లక్షల లోన్ లో రూ.లక్షన్నర కేంద్రం చెల్లిస్తుంది. మిగిలిన రూ.లక్షన్నరను రుణగ్రహీత చెల్లించాలి. అందుకు ఆరు ఏళ్ల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు.
లోన్ కోసం మీరు మీ దగ్గర్లోని ఏ బ్యాంకుకైనా, మీకు ఖాతా ఉన్న బ్యాంకుకైనా వెళ్లి ఉద్యోగిని పథకం గురించి అడగాలి. వారు మీకు ఒక ఫామ్ ఇస్తారు. అందులో మీ వివరాలను, మీ వ్యాపారం ఏంటి? ఏ వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారు? వంటి వివరాలను తెలియజేయాలి. అలాగే ఎంటర్ పెన్యూర్ డెవలప్మెంట్ శిక్షణను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేందుకు మీరు రెండు ఫొటోలు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బర్త్ సర్టిఫికేట్, ఇన్ కమ్ ప్రూఫ్, బ్యాంక్ పాస్ బుక్ ని బ్యాంకుకు అందజేయాల్సి ఉంటుంది. ఇలా మీరు అన్ని అవసరమైన డాక్యుమెంట్స్ అందజేసిన తర్వాత బ్యాంకు వారు మీ లోన్ దరఖాస్తును పరిశీలిస్తారు. మీరు అర్హులని భావిస్తే మీకు లోన్ ని అందజేస్తారు.