విజయ్ మాల్యా.. పేరు వినగానే.. వేల కోట్లు బ్యాంక్‌లకు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అప్పులు కట్టలేక విదేశాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో సీబీఐ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. మాల్యా విదేశాల్లో భారీ ఎత్తున ఆస్తులు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఆ వివరాలు..
ఒకప్పుడు ప్రముఖ వ్యాపారవేత్తగా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, బ్రూవరీస్ సంస్థ అధినేతగా దేశంలో ఓ వెలుగు వెలిగాడు విజయ్ మాల్యా. నిత్యం మీడియాలో హాల్చల్ చేస్తూ.. బాలీవుడ్ సెలబ్రిటీలతో పార్టీల్లో పాల్గొంటూ.. వైభోగం అనుభవించాడు. కానీ తర్వాత పరిస్థితులు తారుమారు అయ్యాయి. ప్రస్తుతం బ్యాంక్‌లకు వేల కోట్ల ఎగవేతదారుగా.. విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్న వ్యక్తిగా మిగిలిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కేసు నడుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. ఈ కేసుకు సంబంధించి సప్లమెంటరీ ఛార్జ్‌షీట్‌లో ఆసక్తికర వివరాలు వెల్లడించింది. ఇక్కడ వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన విజయ్ మాల్య.. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లో 330 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను కొనుగోలు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. దాంతో బ్యాంకులు కూడా మాల్య దగ్గర నుంచి రుణాలను రికవరీ చేసుకోలేకపోయినట్లు సీబీఐ స్పష్టం చేసింది.
ఇక తాజాగా వెల్లడించిన నివేదికలో.. సీబీఐ ఆసక్తికర వివరాలు వెల్లడించింది. ఇక 2008 నుంచి 2016-17 మధ్య మాల్యా వద్ద తగినన్ని నగదు నిల్వలు ఉన్నాయని తెలిపింది. అయితే మాల్యా తన వద్ద ఉన్న మొత్తాన్ని.. సంక్షోభంలో ఉన్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం గానీ, బ్యాంకులకు లోన్లను తిరిగి చెల్లించేందుకు గానీ ఉపయోగించలేదని సీబీఐ వెల్లడించింది. పైగా ఇదే సమయంలో అనగా 2008లో మాల్యా ఫ్రాన్స్‌లో రూ.250 కోట్ల విలువైన ఎల్‌ఈ గ్రాండ్ జర్దిన్‌ను కొనుగోలు చేశారని, 2015-16లో రూ. 80 కోట్లకు యూకేలో లేడీవాక్ కొనుగోలు చేశారని తెలిపింది. అంతేకాక.. మాల్యా పక్కా ప్లాన్ ప్రకారమే విదేశాలకు పారిపోయారని సీబీఐ స్పష్టం చేసింది.
కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ కోసం మాల్యా .. ఐడీబీఐ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున లోన్ తీసుకున్నాడు. అయితే ఆ మొత్తం చెల్లించకుండా విదేశాలకు మకాం మార్చాడు. అప్పటినుంచి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇక ఈ కేసులో గత ఛార్జ్‌షీట్లో ఉన్న 11 మంది నిందితుల పేర్లతో పాటు తాజాగా ఐడీబీఐ బ్యాంక్ మాజీ జనరల్ మేనేజర్ బుద్ధదేవ్ దాస్‌గుప్తా పేరును కూడా చేర్చింది సీబీఐ. 2009 అక్టోబర్‌లో రూ. 150 కోట్ల స్వల్ప కాలిక రుణ మంజూరు కోసం బుద్ధదేవ్ ఐడీబీఐ బ్యాంక్ అధికారులు సహా విజయ్ మాల్యాతో కలిసి కుట్ర పన్నినట్లు సీబీఐ తెలిపింది. ఇది తన అధికార పదవిని దుర్వినియోగం చేయడమేనని సీబీఐ స్పష్టం చేసింది.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా.. సీబీఐ లెటర్స్ రోగటరీ ద్వారా సేకరించిన సాక్ష్యాల ప్రకారం ఛార్జ్‌షీట్ నమోదు చేసింది. దీనిలో అనేక కీలక విషయాలు వెల్లడించింది. 2008-12 మధ్యకాలంలో మాల్యా నుంచి.. ఫోర్స్ ఇండియా ఫార్ములా 1 టీమ్‌కు పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరిగినట్లు.. సీబీఐ గుర్తించింది. ఆ తర్వాత మాల్యా.. కార్పొరేట్ జెట్ కోసం పెద్ద మొత్తంలో నగదు మళ్లింపు జరిగినట్లు తెలిపింది. మాల్యాపై నమోదైన కేసులను సీబీఐతో పాటు ఈడీ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇక 2009 జనవరి 5న ముంబయిలోని ప్రత్యేక కోర్టు మాల్యాను ఎగవేత దారుగా ప్రకటించింది.