గత కొన్ని రోజులుగా బంగారం ధర ప్రతి రోజు పడిపోతుంది. మరి ఈ ట్రెండ్ ఇలానే కొనసాగుతుందా.. ఇప్పుడు బంగారం కొనడం కరెక్టేనా అన్న ఆలోచనలో ఉన్నారు జనాలు. ఈ క్రమంలో బులియన్ మార్కెట్ నిపుణులు గుడ్ న్యూస్ చేబుతున్నారు. త్వరలోనే బంగారం ధర తులం రూ.50 వేలకు పడిపోతుంది అంటున్నారు. ఎందుకో తెలియాలంటే..
భారతీయులకు బంగారంతో విడదీయరాని అనుబంధం ఉంది. చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉంటే చాలు.. చిన్నదో పెద్దదో బంగారు ఆభరణం కొనడానికే మొగ్గు చూపుతారు. అత్యవసర సమయంలో.. చేతిలో డబ్బులు లేకపోయినా.. బంగారం ఉంటే చాలు.. భరోసా ఉంటుంది. ఇక వివాహాది శుభకార్యలకు వారి వారి స్థోమతను బట్టి బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత కొన్నాళ్లుగా బంగారం ధర చుక్కలను తాకుతుంది. ప్రస్తుతం తులం బంగారం ధర 24 క్యారెట్స్ 57 వేలకు పైగా ఉండగా.. 22 క్యారెట్స్ 52 వేలకు పైగా ఉంది. అయితే కొన్ని నెలల క్రితం వరకు పెరగడం తప్ప తగ్గడం తెలీదు అన్నట్లుగా బంగారం ధర దూసుకుపోయింది. అయితే ఓ వారం, పది రోజుల నుంచి బంగారం ధర భారీగా తగ్గుతూ వస్తోంది.
దాంతో చాలా మంది బంగారం కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. కొందరేమో ఇంకా తగ్గుతుందేమో.. అప్పుడు కొనడం బెటర్ అన్నట్లుగా ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో పసిడి ప్రియులకు ఓ శుభవార్త చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. త్వరలోనే బంగారం ధర భారీగా పడిపోతుందని.. మార్చి నాటికి తులం బంగారం ధర రూ. 50 వేల దిగువకు వస్తుంది అంటున్నారు. మరి పసిడి ధరలు ఇంతలా పడపోతాయని చెప్పడానికి బలమైన కారణమే ఉంది. అది ఏంటంటే..
గత రెండు నెలల్లో బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఒకానొక దశలో 24 కేరట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 58,500 వరకు వెళ్లింది. దాంతో త్వరలోనే తులం బంగారం 60 వేలు అవుతుందని.. ఈ ఏడాది బంగారం ఆల్ టైం గరిష్టస్థాయికి చేరుతుందని.. తులం లక్ష రూపాయలు పలుకుతుందని అంచనా వేశారు. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధర క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే గత వారం రోజుల నుంచి బంగారం ధర ప్రతి రోజు పడిపోతుంది.
ప్రస్తుతం 22 క్యారెట్ బంగారం తులం ధర 52వేలకు పైగా ఉండగా.. 24 క్యారెట బంగారం తులం ధర రూ. 56వేల దిగువకు పడిపోయింది. అంటే ఈ పది రోజుల్లోనే తులం బంగారం ధర 2000 రూపాయలు తగ్గిపోయింది. బంగారం కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంతేకాక ఈ ఏడాది పెళ్లిళ్ల సీజన్‌లో మిగతా కాలలతో పోలిస్తే.. బంగారం ధర తగ్గడం సామాన్యులకు కలిసి వచ్చింది.
అయితే పసిడి ధర ఇలా తగ్గడం వెనక అంతర్జాతీయ కారణాలు కూడా ఉన్నాయి అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. మరీ ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ విలువ రోజురోజుకీ పెరుగుతోంది. అంతేకాక ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరింది. అలానే యూరో కరెన్సీ సైతం డాలర్ విలువకు సమానంగా బలపడుతుంది. దాంతో యూఎస్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు మదుపుదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారంపై పెట్టుబడి పెట్టేవారికి రిటర్న్స్ పెద్దగా రావని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి అనుగుణంగానే గత కొంతకాలంగా అంతర్జాతీయంగా కూడా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. డాలర్ ఎంత బలపడితే బంగారం ధర కూడా అంత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో బంగారం ధర మరింత తగ్గే అవకాశం మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవే పరిణామాలు కొనసాగితే.. సమీప భవిష్యత్తులో.. బంగారం ధర మరింత తగ్గవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతేకాక బంగారం ధర ప్రస్తుత స్థాయి నుంచి మరో రెండు వేల రూపాయల వరకు పతనమయ్యే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అమెరికాలో బంగారం ధర ఔన్స్ 1830 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఇవే పరిణామాలు కొనసాగి.. బంగారం ధర మరో 30 డాలర్లు తగ్గి.. 1800 డాలర్లకు చేరుకుంటే.. దేశీయంగా కూడా బంగారం ధర భారీగా తగ్గే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కనక జరిగితే ఈ ఏడాది మార్చి నెలలో బంగారం ధర రూ. 50,000 దిగువకు చేరే సూచనలు కనిపిస్తున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.