మాజీ మంత్రి వైఎస్ వివేకారెడ్డి హత్య కేసులో రోజులో కీలక పరిణామం చోటు చేసుకుంటింది. ఇక తాజాగా ఈ కేసుకు సంబంధించి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ క్రమంలో కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. ఈ కేసులో సీబీఐ ఎంపీ అవినాష్ రెడ్డిని రెండు సార్లు విచారించగా.. తాజాగా మరోసారి సారి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తనని అరెస్ట్ చేయకుండా ఆదేశించాలంటూ అవిపాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. దీంతో సోమవారం వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ కేసులో మరో మహిళ పేరు తెరపైకి వచ్చింది. ఇంతకు ఆమె ఎవరు.. ఈకేసుకు ఆమెతో సంబంధం ఏంటి అంటే..
అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌లో కీలక అంశాలు ఉన్నాయి. వివేకా.. తన రెండో భార్య కొడుకును వారసుడిగా ప్రకటించే ప్రక్రియలో.. ఆయన హత్య జరిగి ఉండొచ్చని అవినాష్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. 2010లో షేక్ షమీమ్ అనే మహిళను వివేకా రెండో వివాహం చేసుకున్నారని.. అప్పటి నుంచి ఆయన కూతురు సునీతతో వివేకా సంబంధాలు దెబ్బతిన్నాయని వివరించారు. అంతేకాక 2015లో షమీమ్, వివేకాకు ఓ కుమారుడు పుట్టాడని.. దాంతో తమ కుటుంబం నుంచి దూరంగా ఉండాలని సునీత వారిని బెదిరించింది అని అవినాష్ రెడ్డి తెలిపారు.
అంతేకాక షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాగ్మూలంలో ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పిందని.. తనతో వివాహం తర్వాత వివేకా చెక్ పవర్‍ను తొలగించారని తెలిపారు. ఇక సునీత, వివేకా సతీమణి హైదరాబాద్‍లో ఉంటే.. వివేకానంద రెడ్డి మాత్రం ఒంటరిగా పులివెందులలో ఉండేవారు అని గుర్తు చేశారు. షమీమ్‍కు పుట్టిన కుమారుడిని వారసుడిగా ప్రకటిస్తారని చర్చ జరిగిన నేపథ్యంలో.. ఆయన హత్య జరిగి ఉండొచ్చు అన్నారు. అంతేకాక దుండగులు హత్య తర్వాత వివేకా ఇంట్లో డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు షమీమ్ చెప్పడం దీనికి బలం చేకూరుస్తుంది అంటూ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
అనంతరం అవినష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘నేను ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా. కానీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ క్యాడర్ కూడా నన్ను ప్రశ్నిస్తోంది. ఇక నుంచి నేను మాట్లాడటం మొదలుపెడతాను. వివేకా ది మర్డర్ ఫర్ గైన్. రెండో భార్య, ముస్లిం మహిళకు పుట్టిన కొడుకును.. వివేకా తన రాజకీయ వారసుడిగా ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాక వివేకా తన పేరును కూడా ముస్లిం పేరుగా మార్చుకున్నారు. ఈ ఆస్తులన్నీ వాళ్లకి వెళ్లిపోతాయని.. రెండో భార్య సంతానం రాజకీయ వారసులుగా వస్తారని.. సునితమ్మ భర్త రాజశేఖర్ కుట్ర చేశారని నా అనుమానం. హత్య జరిగిన ప్రాంతంలో లెటర్‌ను మాయం చేశారు’’ అని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాక ‘‘సీబీఐ విచారణ వ్యక్తి టార్గెట్‌గా జరుగుతోంది. అప్రూవర్‌గా మారిన వ్యక్తి ఇచ్చిన వాగ్మూలంలో ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అన్ని ఉన్నాయి. అయినా సరే సీబీఐ ఈ కోణంలో విచారణ జరపడం లేదు ఎందుకు. నేను గుండె పోటు అని చెప్పినట్టు టీడీపీ వాళ్లు చిత్రీకరించారు. వివేకా చనిపోయిన విషయం నాకు కుటుంబ సభ్యులు చెప్పిన తర్వాతే.. నేను హత్య జరిగిన ఇంటికి వెళ్లాను. ఆ తర్వాత పోలీసులకు, ఇతర బంధువులకు, ముఖ్య నాయకులకు ఫోన్ చేశాను. నా సోదరి సునితమ్మ హైకోర్టులో, సుప్రీంకోర్టులో అనేక ఆరోపణలు చేసింది. ఏ ఒక్క రోజు నేను ఎవరి గురించి మాట్లాడలేదు. నేను కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగానే.. సీబీఐ అధికారులు సునితమ్మకు సమాచారం ఇచ్చి ఇంప్లీడ్ చేస్తున్నారు’’ అని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.