విశాఖపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు మద్దతుగా నాన్ పొలిటికల్ జేఏసీ నిర్వహించిన విశాఖ గర్జన విజయవంతం అయ్యింది. ఈ క్రమంలో విశాఖ గర్జనకు వస్తున్న మంత్రుల కార్లపై ఎయిర్‌పోర్ట్ వద్ద జనసేన కార్యకర్తలు దాడి చేశారని వైసీపీ ఆరోపించింది. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని జనసేన ప్రకటించింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కు విశాఖ పోలీసులు నోటీసులు ఇచ్చారని.. పవన్‌ని వెంటనే విశాఖ విడిచి వెళ్లాలని సూచించినట్లు వార్తలు ప్రచారం అయ్యాయి. తాజాగా ఈ వార్తలపై విశాఖ ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర స్పందించారు.
ఈ సందర్భంగా ఏసీపీ హర్షిత చంద్ర మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌ని లిఫ్ట్ చేసే ఆలోచన తమకు లేదన్నారు. అంతేకాక ఆయనని వెళ్లి పోవాలంటూ తాము ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు అని తెలిపారు. ఇదంతా అబద్దపు ప్రచారం మాత్రమే అన్నారు. అంతేకాక తాము పవన్‌కిచ్చిన నోటీసులో.. విశాఖలో పబ్లిక్ స్పీచ్‌లు, బహిరంగ సమావేశాలు, ధర్నాలు, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని… శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు అని మాత్రమే నోటీసులో పేర్కొన్నాము అని తెలిపారు. మరోవైపు పవన్ కళ్యాణ్.. తమ పార్టీ కార్యకర్తలను వెంటనే విడిచిపెట్టాలని, అప్పటివరకు విశాఖను వదిలి వెళ్లిపోనంటూ స్పష్టం చేశారు.