‘విశాఖ గర్జన’ పర్యటనను ముగించుకొని వెళ్తున్న వైసీపీ నేతలపై జనసేన కార్యకర్తలు, నాయకులు దాడికి పాల్పడ్డ సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు రోజా, జోగి రమేష్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కార్లపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ నాయకులకు చెందిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు పాల్పడ్డ పలువురు జనసేన నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. విశాఖ పోలీసులు అరెస్ట్ చేసిన జనసేన నాయకుల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
“విశాఖ పోలీసులు జనసేన నేతలతో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. జనసేన పార్టీ ఎల్లప్పుడూ పోలీసులను గౌరవిస్తుంది. జనసైనికులు ఎవరిపై దాడి చేయలేదు. తమ కార్యక్రమాలను డైవర్ట్ చేయడానికి అధికార వైసీపీ చేస్తున్న కుట్ర ఇది. పోలీసులు అకారణంగా అరెస్ట్ చేసిన తమ జనసేన నాయకుల్ని తక్షణమే విడుదల చేయాలి. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పోలీస్ స్టేషన్ ముందే నిరసనకు దిగుతానంటూ..” పవన్ పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
I request @dgpapofficial to intervene and release our leaders immediately. I shall be forced to express my solidarity at the Police Station.
— Pawan Kalyan (@PawanKalyan) October 15, 2022
కాగా, జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడానికి ఆందోళనకారులు ప్రయత్నించినట్లు వార్తలొస్తున్నాయి. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వకుండా విశాఖలో ఎందుకు అడుగు పెట్టారో చెప్పాలని ఆందోళనకారులు జనసేన నేతను ప్రశ్నించారు. మూడు రాజధానులకు పవన్ కళ్యాణ్ అనుకూలమో కాదో చెప్పాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఈ విషయమై స్పష్టత ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ని కోరారు. అయితే ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.