Chandrababu Naidu: తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి 1995 ఆగస్టు సంక్షోభం గురించి తెలిసే ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని తీసుకోవటంపై ముందు నుంచి మిశ్రమ స్పందన వస్తూ ఉంది. చంద్రబాబు చర్యను కొంతమంది వెన్నుపోటుగా అభివర్ణిస్తుంటే.. మరికొంతమంది పార్టీని కాపాడుకోవటానికే చంద్రబాబు అలా చేశారని అంటూ ఉన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు దాటింది. 1995 ఆగస్టు సంక్షోభం గురించి ప్రజలు పూర్తిగా మరిచిపోయారు. అలాంటి ఈ సమయంలో చంద్రబాబు 1995 ఘటన గురించి ప్రముఖ ఓటీటీ టాక్‌షో వేదికగా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది.
తాజాగా, బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ‍్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్‌లో పాల్గొన్న చంద్రబాబు 1995 ఆగస్టు సంక్షోభం గురించి మాట్లాడారు. ‘‘ ఒక్కోసారి జీవితంలో ఎన్నో చేస్తుంటాం. 1995 నిర్ణయం కూడా అలాంటిదే. ఎన్టీఆర్ దగ్గరికి నేను, మీరు, హరికృష్ణ వెళ్లాం. అక్కడే బీవీ మోహన్ రెడ్డి, ఎన్టీఆర్ ఉన్నారు. లోపలికి వెళ్లగానే.. ఫ్యామిలీ గురించి అయితే ముగ్గుర్ని మాట్లాడమన్నారు. రాజకీయమైతే నన్ను ఒక్కడినే మాట్లాడమన్నారు. మీరు బయటకు వెళ్లి కూర్చున్నారు. నేను 3 గంటలు ఆయనతో మాట్లాడాను. చాలా బతిమాలా.. నా మాట వినండి అని కాళ్లు కూడా పట్టుకున్నా.
రామబాట ముఖ్యమని ఆంజనేయుడు తిరుగుబాటు చేసి ముందుకెళ్లడం చరిత్ర. నేను అందుకే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకున్నా’’ అంటూ ఆనాడు జరిగిన సంగతుల్ని చంద్రబాబు షోలో పంచుకున్నారు. అయితే, ప్రజలు మరిచిపోయిన నాటి సంగతిని చంద్రబాబు మళ్లీ తెరపైకి తేవటం ఆయన్ని అనవసరంగా ఇరకాటంలో పడేసిందనే ప్రచారం జరుగుతోంది. షోలో దాని గురించి చెప్పి మళ్లీ గుర్తు చేయటం ఎంటన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్లస్ అవుతుందనుకున్న చంద్రబాబు వివరణ కాస్తా రివర్స్ అయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి.