ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్‌గా ఉంటాయి. అధికార-విపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే కాక కొన్నిసార్లు.. అధికారుల తీరు వల్ల ఏపీ రాజకీయాలు హాట్ టాపిక్‌గా మారతాయి. తాజాగా అలాంటి ఒక సంఘటన వైరలవుతోంది. ఆ వివరాలు..
మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చొన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పర్యటన జరుగుతోన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి జవహర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడిన నేపథ్యంలో పోలీసులు చంద్రబాబును అడుకున్నారు. దాంతో పక్కనే ఉన్న జవహర్.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో పోలీసులు జవహర్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో జవహర్ పోలీస్ స్టేషన్‌లో నేలపై కూర్చుని ఉన్నారు. అయితే పోలీసులు కావాలనే జవహర్‌ను అలా నేలపై కూర్చోబెట్టారని టీడీపీ ఆరోపిస్తోంది.
ఈ సందర్భంగా జవహర్.. తనతో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక స్టేషన్ సీఐ తనను కొట్టారని.. తీవ్ర పదజాలంతో దూషించారని జవహర్ ఆరోపించారు. ఒక గంజాయి స్మగ్లర్, గజ దొంగను చూసినట్టు.. పోలీసులు తనను చూశారని.. తనతో నీచంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. పోలీసులపై కేసు నమోదుచేసే వరకూ కదిలేది లేదంటై అక్కడే భీష్మించుకు కూర్చున్నారు జవహర్. ఆయనతో పాటు టీడీపీ బీసీ సెల్ నాయకుడు కేతా శ్రీనివాస్ కూడా నేలపై కూర్చున్నారు.
ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సూచనలతో తనతో దురుసుగా ప్రవర్తించిన అధికారులపై జవహర్ ఫిర్యాదు చేశారు. వారిపై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అనంతరం ఆయన స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. ఒకవేళ ఇద్దరిపై కేసు నమోదు చేయకపోతే.. ప్రైవేట్ కేసు వేస్తానని హెచ్చరించారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.