ఆంధ్రప్రదేశ్ టీడీపీ లో విషాదం చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా పి.గన్నవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి(68) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంతో.. కుటుంబ సభ్యులు అమలాపురంలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు.
రాజకీయాల్లోకి రాకముందు అయన బీఎస్ఎన్ఎల్ లో ఉద్యోగం చేసేవారు. 1996లో టీడీపీ లో చేరి ‘నగరం’ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2004లో తన స్థానాన్ని బీజేపీ కి కేటాయించడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయారు. 2014 నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. 2019 ఎన్నికల్లో ఆయనకు టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు.. దీంతో వైఎస్సార్‌సీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
వైఎస్ జగన్ ప్రచారానికి వచ్చిన సమయంలో.. ఆయన సమక్షంలోనే కండువా కప్పించుకునేందుకు వెళ్లారు.. కానీ అనూహ్యంగా పార్టీలో చేరకుండా వెనుదిరిగారు. అనంతరం బీజేపీలో చేరారు. అనంతరం కొంతకాలానికి అక్కడి నుంచి బయటకు వచ్చారు. రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న ఆయన వివాదాలకు దూరంగా ఉన్నారు. నారాయణ మూర్తికి భార్య, ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలున్నారు. నారాయణ మూర్తి హఠాన్మరణంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విషాదఛాయలు అలుముకున్నాయి.