ఈ మధ్యకాలంలో వాహనాల్లో మంటలు చెలరేగి.. ప్రమాదాలకు కారణమవుతున్న సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి.. కాలి బూదిదయ్యింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుడివాడ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక మంటలు చెలరేగిన సమయంలో బస్సులో విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో కలిసి మొత్తం 60 మంది దాకా ఉన్నారు. అయితే మంటలు గుర్తించిన వెంటనే డ్రైవర్ అప్రమత్తమయ్యి.. వారిని కిందకు దింపేయడంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే బస్సులో మంటలు చెలరేగాయి అన్న విషయం తెలియడంతో విద్యార్థులు, మిగతా ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో తమకు సంబంధించిన వస్తువులను బస్సులోనే వదిలేయడంతో.. అవన్ని మంటల్లో కాలి బూడిదయ్యాయి. ఇక ప్రయాణికులు బ్యాగుల్లో నగదు, బంగారు ఆభరణాలు, దుస్తులు, ఇతర వస్తువులు ఉన్నాయని.. అవన్ని మంటల్లో కాలి బూడిదైనట్లు తెలిపారు. ఇక ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ అప్పమత్తతో ప్రయాణికులు ఎవరికి చిన్న గాయం కూడా కాలేదని తెలిపారు.