దేశ రక్షణ కోసం జవానుగా వెళ్లిన ఆ యువకుడు విగతజీవిగా మారాడు. పెళ్లైన రెండు నెలలకే రోడ్డు ప్రమాదం రూపంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ ఆర్మీ జవాను మరణం అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
అనకాపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. దేశ రక్షణ కోసం వెళ్లిన ఆ జిల్లా యువకుడు విగతజీవిగా మారాడు. పెళ్లైన రెండు నెలలకే ఈ ఇలా జరగడం అక్కడ మొత్తాన్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. పెళ్లి కోసం నెల రోజులపాటు సొంత గ్రామంలోనే ఉన్నాడు. అందరితో కలిసి సరదాగా గడిపాడు. మూడు ముళ్ల బంధంతో ఒక ఇంటవాడు అయ్యాడు. ఎంతో ఆనందంగా జీవితాన్ని గడపాలని ఊహించుకున్న ఆ యువతి జీవితం అగమ్యగోచరంగా మారింది. విధి నిర్వహణకు వెళ్లిన కొద్ది రోజుల్లోనే ఆమె భర్త చావు వార్త విని అల్లాడిపోయింది. ఆ యువకుడి మరణం మొత్తం కుటుంబాన్ని కలచివేసింది.
అనకాపల్లి జిల్లా చీడికాడ మండలంలోని దిబ్బపాలెం గ్రామానికి చెందిన మహేశ్ అనే యువకుడు ఆర్మీ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. పంజాబ్ లో జవానుగా డ్యూటీ చేస్తుండగా.. విధి నిర్వహణలో భాగంగా తోటి జవాన్లతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ప్రత్యేక వాహనంలో ఢిల్లీ నుంచి తిరిగి వస్తుండగా మార్గం మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే మహేశ్ ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు బండి నుంచి దిగారు. అక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా ఒక టూ వీలర్ వచ్చి మహేశ్ ను బలంగా ఢీకొట్టింది. గాయాలపాలైన మహేశ్ ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మహేశ్ మృతి చెందారు. ఆ విషయాన్ని ఆర్మీ ఉన్నతాధికారులు మహేశ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు.
మహేశ్ మరణ వార్త విని కుటుంబం మొత్తం విలవిల్లాడిపోయింది. అతనికి ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వివాహం కూడా జరిగింది. నెలరోజులు సెలవు తీసుకుని మహేశ్ సొంతూరులో ఉన్నాడు. వివాహం తర్వాత సెలవులు ముగియడంతో తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యాడు. వివాహమైన రెండు నెలలకే అతను తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడం కుటుంబాన్నే కాదు.. గ్రామస్థులను కలచి వేసింది. మహేశ్ మరణ వార్త విని భార్య గుండె పగిలింది. కాళ్ల పారాణి కూడా ఆరకుండానే తన భర్త ఇలా కాలం చేశాడనే వార్తను జీర్ణించుకోలేకపోయింది. మహేశ్ మరణ వార్తతో దిబ్బపాలెంలోనే కాదు.. యువతి స్వగ్రామమైన మాకవరం మండలంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదివారం మధ్యాహ్నానికి మహేశ్ మృతదేహం చీడికాడ చేరుకునే అవకాశం ఉంది.