గుంటూరు టీడీపీ నేత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో ఉంటున్న అల్లుడు.. వీకెండ్‌లో సరదాగా గడపాడానికి వెళ్లి మృతి చెందాడు. సరదాగా ట్రెక్కింగ్‌కి వెళ్లి.. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి కింద పడి చనిపోయాడు. ఆ వివరాలు.. గుంటూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణికి.. రాజేంద్రనగర్‌కు చెందిన శ్రీనాథ్‌తో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతులిద్దరూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం వీరు అట్లాంటాలో ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆదివారం సెలవు కావడంతో భార్యాభర్తలు సరదాగా ఎంజాయ్ చేద్దామని అట్లాంటాలోని క్లీవ్‌లెన్స్ మౌంటెన్ హిల్స్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శ్రీనాథ్.. 200 అడుగుల ఎత్తు నుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయారు. కుమారుడి మరణవార్త తెలియడంతో శ్రీనాథ్ తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారు. శ్రీనాథ్ మృతదేహాన్ని గుంటూరుకు తీసుకువచ్చేందుకు వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని మృతుడి మామ సుఖవాసి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనాథ్ మృతి నేపథ్యంలో అమెరికాలో ఉన్న గుంటూరు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి.. గుంటూరుకు చెందిన ఎన్‌ఆర్ఐలు బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.. వారికి సాయం అందిస్తున్నారు. అంతేకాక పలువురు టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి పరామర్శించారు.. శ్రీనాథ్ మృతిపై సంతాపాన్ని తెలియజేశారు.