ఇక్కడ కనిపిస్తున్న మహిళ పేరు శైలజ. న్యాయం కోరుతూ గత 10 రోజులుగా ఓ పోరాటం చేస్తోంది. తనకు జరుగుతున్న దారుణాన్ని, మోసాన్ని సహించలేని ఈ ఇల్లాలు.. న్యాయం జరిగే వరకూ నా పోరాటాన్ని ఆపేది లేదంటూ వాపోతుంది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు కూడా రాకూడదంటూ అన్యాయంపై యుద్దం చేస్తుంది. అసలు ఈ మహిళకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అంతలా దారి తీసిన పరిస్థితులు ఏంటనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీలోని కోనసీమ జిల్లా మండపేట ద్వారపూడి గ్రామం.
ఇదే ప్రాంతానికి చెందిన లక్ష్మీ శైలజ, మోహన్ శ్యామ్ శరణ్ 2020లో వివాహం చేసుకున్నారు. భర్త మోహన్ శ్యామ్ శరణ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. అయితే పెళ్లి సమయంలో లక్ష్మీ తల్లిదండ్రులు కట్నం కింద శ్యామ్ శరణ్ కు ఐదు కుంచాల పొలంతో పాటు రూ.10 లక్షల కట్నం, 20 తులాల బంగారాన్ని ముట్టజెప్పారు. ఇక పెళ్లైన కొన్నిరోజులు మాత్రమే భర్త శరణ్ భార్య లక్ష్మీతో సంసారం చేశాడు. ఇక ఆ తర్వాత మోహన్ శ్యామ్ ఉద్యోగం నిమిత్తం హైద్రబాద్ కు వెళ్లాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా రెండేళ్లు అక్కడే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ వచ్చినా భార్యతో కలవకుండా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ రెండు సంవత్సరాలలో మోహన్ శ్యామ్ భార్య లక్ష్మీతో కనీసం 10 రోజులు కూడా సంసారం చేసింది లేదట.
ఇదే విషమంపై అత్తమామలను లక్ష్మీ ప్రశ్నించగా.. మతిస్థిమితం లేని విధంగా ప్రవర్తిస్తున్నావని, ఆత్మహత్యాయత్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందనే కారణంతో అత్తింటివాళ్లు తమ కుమారుడి వద్దకు పంపించడం లేదు. పైగా భర్తతో ఫోన్ లు మాట్లాడుతున్నా కూడా వద్దని ఫోన్లు లాగేసుకుంటున్నారని మహిళ వాపోతుంది. వీటిన్నిటినీ భరించలేని మహిళ లక్ష్మీ అత్తింటి ముందు మౌన పోరాటానికి దిగింది. కోడలు చేస్తున్న వ్యవహారాన్ని పసిగట్టిన అత్తమామలు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఆ మహిళ ఇలా ఒకటి కాదు, రెండు కాదు.., ఏకంగా 10 రోజుల పాటు అత్తింటి ముందు మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదని లక్ష్మీ వాపోతుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.