దానాల్లో కెల్లా గొప్పదానం అన్నదానం అని అంటారు. అనేక మంది గొప్ప మనసు చాటుకుని రోజూ కొన్ని వందల, లక్షల మంది ఆకలి తీరుస్తున్నారు. తాజాగా ఈ కోవలో మున్సిపల్ అధికారులు చేరిపోయారు. ఫుడ్ బ్యాంకుల పేరుతో నిత్యం వందల మందికి రెండు పూటలా భోజనం పెడుతూ వారి కడుపు నింపుతున్నారు.
ఫుడ్ బ్యాంకుల గురించి మీకు తెలిసే ఉంటుంది. విదేశాల్లో ఎక్కువగా ఉంటాయి. రోడ్ల పక్కన ఫుడ్ బ్యాంకులు ఉన్నాయి. ఫ్రిడ్జ్ లు ఉండి.. అందులో తినే ఆహార పదార్థాలు ఉంటాయి. ఫుడ్ బ్యాంకులను చూసి ఎవరికైనా సాయం చేయాలనిపిస్తే.. ఆ ఫ్రిడ్జ్ లలో ఆహారం పెట్టేసి వెళ్ళిపోతారు. పేద ప్రజలు, అనాథలు ఈ ఫుడ్ బ్యాంకుల్లో ఫుడ్ తీసుకుని కడుపు నింపుకుంటారు. ఈ ఫుడ్ బ్యాంకు కాన్సెప్ట్ ఇండియాలో కూడా అడుగు పెట్టింది. ఇప్పటికే దేశంలో ప్రధాన నగరాల్లో ఫుడ్ బ్యాంకులు వెలిసాయి. ఎంతోమంది కడుపు నింపుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో కూడా ఫుడ్ బ్యాంక్ పేరుతో ఆకలి అన్న వారి ఆకలి తీరుస్తున్నారు.
విజయనగరం నగర పాలక సంస్థ ఫుడ్ బ్యాంకుల పేరుతో అన్నార్తుల ఆకలిని తీర్చుతుంది. ఏడాదిన్నర క్రితం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ ఫుడ్ బ్యాంకులు అప్పటి నుంచి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఆకలి అని వచ్చిన వారికి కడుపు నింపుతున్నాయి ఈ ఫుడ్ బ్యాంకులు. ఈ బృహత్తర కార్యక్రమంలో విజయనగరం నగర పాలక సంస్థ అధికారులు, దాతలు భాగస్వాములై ఉన్నారు. కరోనా సమయంలో ఆకలితో అలమటించిన వారిని చూసి చలించిపోయిన అధికారులు ఫుడ్ బ్యాంకుల రూపకల్పనకు తొలి అడుగు వేశారు. పేదలకు ఉచితంగా రెండు పూటలా భోజనం అందించడానికి ఈ ఫుడ్ బ్యాంకులను ఏర్పాటు చేశారు.
ఫుడ్ బ్యాంకుల కోసం నాలుగు ఫ్రిడ్జ్ లను కొనుగోలు చేసి.. నగరంలో అత్యంత రద్దీ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. ఈ ఫ్రిడ్జ్ లలో రెండు పూటలా భోజనం సమకూర్చేలా వివిధ సంస్థలను, హోటల్స్ ను భాగస్వామ్యం చేశారు. వీరి సహకారంతో రోజూ 600 మంది పేదల కడుపు నింపుతున్నామని నిర్వాహకులు తెలిపారు. మరి ఫుడ్ బ్యాంకులు పెట్టి రోజూ రెండు పూటలా పేదల కడుపు నింపుతున్న విజయనగరం నగర పాలక సంస్థ అధికారులపై, అలానే ఈ కార్యక్రమంలో భాగస్వాములైన దాతలపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.