దుక్కి దున్నే రైతన్న సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు వారు ఆర్థికంగా అభివృద్ధి చెందితే.. దేశం బాగుపడుతుంది. ఈ విషయాన్ని బలంగా నమ్మడమే కాక.. ఆచరించి మరి చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రాష్ట్ర ప్రజలందరికి లబ్ధి చేకూరేలా వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. అన్నదాతలు, బడుగు, బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందడం కోసం ఆర్థిక సాయం అందచేస్తున్నారు. దీనిలో భాగంగానే రైతన్నలను ఆదుకోవడం కోసం వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రతి ఏటా మూడు విడతలుగా రైతులకు 13,500 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఈ క్రమంలో వరుసగా నాలుగో ఏడాది రెండవ విడత రైతు భరోసా నిధులను నేడు విడదల చేశారు సీఎం జగన్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్ బహిరంగ సభలో ప్రసంగించిన తర్వాత బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాలో నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా అర్హులైన రైతులందరి ఖాతాలో 4 వేల రూపాయలు జమ చేశారు సీఎం జగన్. వైఎస్సార్ రైతు భరోసా కింద.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50.92 లక్షల మంది రైతులకు రూ.2,096.04 కోట్ల సాయాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి అకౌంట్‌లలో వేశారు. రైతు భరోసా ద్వారా రైతులకు ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 సాయంగా ప్రభుత్వం అందచేస్తోంది. దీనిలో భాగంగా తొలి విడత సాయాన్ని మే నెలలో ఖరీఫ్‌కు ముందే రూ.7,500 చొప్పున ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. రెండో విడతగా రూ.4వేలు సాయం.. మూడో విడతగా సంక్రాంతి సమయంలో మరో రూ.2,000 సాయాన్ని రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు.
ఈ పథకం ద్వారా కేవలం రైతులకు మాత్రమే కాక అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న అన్నదాతలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా ద్వారా ఏటా రూ.13,500 ఆర్థిక సాయం అందిస్తూ.. రైతు బాంధవుడిగా నిలస్తున్నాడు సీఎం జగన్. ఇప్పటి వరకు వైస్సార్ రైతు భరోసా కార్యక్రమం ద్వారా.. రైతన్నలకు 25, 971.33 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరింది.
ఇప్పటి వరకు ఈ పథకం కింద.. 24,61,000 మంది బీసీ లబ్ధిదారులకు రూ.12,113.11 కోట్ల ఆర్థిక సహాయం అందగా.. 5,23,000 మంది ఎస్సీ లబ్ధిదారులకు రూ.2,653.04 కోట్లు.. 3,92,000 మంది ఎస్టీలకు రూ. 1,771.13 కోట్లు.. 60 వేల మంది మైనారిటీలకు రూ.320.68 కోట్ల ఆర్థిక సాయం అందింది. అలానే 7,85,700 మంది కాపు లబ్ధిదారులకు రూ.3,793.44 కోట్లు, ఇతర వర్గాలకు చెందిన 10,16,300 మంది లబ్ధిదారులకు రూ.5,319.93 కోట్లు భరోసా సాయం అందింది.