ఆస్తుల కోసం, అడుగు భూమి కోసం అన్నలతో తెగతెంపులు చేసుకునే చెల్లెళ్లను చూసుంటారు. కానీ ఎటువంటి ఆస్తులు లేకపోయినా రక్తం పంచుకు పుట్టిన అన్నయ్యే ఆస్తి అని భావించే చెల్లెమ్మను చూశారా?
ఆస్తుల కోసం తోడబుట్టిన వాళ్ళను వదిలేసే మనుషులు ఉన్నారు. అడుగు భూమి కోసం అయినోళ్ళని వద్దని వదిలేసి వెళ్లిపోయే మనుషులు ఉన్నారు. అన్నతో గొడవపడిన తమ్ముడు, చెల్లెలి ముఖం చూడని అన్న, ఎదురుపడితే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోని అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల, అన్నదమ్ములు ఇలా ఎంతో మంది మనుషులు ప్రేమను కోల్పోయి బతుకుతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళు ఉన్న సమాజంలో కూడా ఆస్తుల కన్నా రక్త సంబంధమే ఎక్కువ అని ప్రేమతో మెలిగే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో తిరుపతి జిల్లా రేణిగుంటకు చెందిన ఈ తల్లి ఒకరు.
ఆస్తులు లేవు, దేవుడిచ్చిన అన్నయ్యే ఆస్తి. తోడబుట్టిన అన్నయ్యే ఆస్తిగా భావించి కన్న తల్లి పంచే ప్రేమను పంచుతున్నారు. పేరుకే చెల్లెలు అయినా తన కడుపున పుట్టిన బిడ్డలతో పాటు సమానంగా కన్న తల్లిలా చూసుకుంటున్నారు. ఆమె అన్నయ్య పుట్టినప్పటి నుంచి మాట్లాడలేరు, నడవలేరు. అంగవైకల్యం ఆయనను చిన్న చూపు చూసినా చెల్లెలు మాత్రం ఎటువంటి లోటూ లేకుండా చూసుకుంటున్నారు. తమకు పెద్దగా ఆస్తులు లేవని.. అయినా గానీ అన్నయ్యను చచ్చే వరకూ చూసుకుంటానని ఆమె అన్నారు. ఆమె భర్త పెయింటింగ్ పని చేస్తారు. పెయింటింగ్ పని అంటే పెద్ద ఆదాయం ఏమీ ఉండదు. చిన్న చిన్న జీవితాలు. అంతటి ఇరుకైన జీవితంలో కూడా బావకు చోటు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు.
అందులోనూ అంగవైకల్యం ఉన్న బావకు ఇంట్లో చోటు ఇచ్చి సేవలు చేయడం. అమ్మ, నాన్నలకు కాళ్ళు నొప్పులొస్తే నొక్కడానికి విసుక్కునే కొడుకులు ఉన్నారు. అలాంటిది కాళ్ళూ, చేతులూ పడిపోయి లేవలేని స్థితిలో ఉన్న అన్నకు సేవలు చేయడం అంటే చిన్న విషయం కాదు. బాత్రూంకి తీసుకెళ్లాలి, స్నానం చేయించాలి. అన్నం తినిపించాలి. చంటి బిడ్డలా చూసుకోవాలి. తమ వ్యక్తిగత ఆనందాలకు అడ్డు అని చెప్పి పిల్లలనే హాస్టల్స్ లో వేసే తల్లిదండ్రులున్న ఈరోజుల్లో చెల్లెలు అన్నయ్యను ఇంట్లో ఉంచుకోవడం చిన్న విషయం కాదు. ఈ విషయంలో అన్నకు సేవలు చేస్తున్న చెల్లెలు, బావ బాగోగులు చూసుకుంటున్న బావమరిది ఇద్దరూ గొప్ప వ్యక్తులే. మరి మీరేమంటారు. తోడబుట్టిన అన్నయ్యను కన్న బిడ్డలా చూసుకుంటున్న ఈ తల్లికి ఒక సెల్యూట్ చేయండి.