ఐపీఎల్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టు, అత్యంత విజయవంతమైన టీమ్ ముంబై ఇండియన్స్ ఈ ఏడాది మాత్రం దారుణంగా.. ఆడిన తొలి ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలైంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఇలా తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోవడం ఇది రెండుసారి. 2014లో కూడా ముంబై తొలి ఐదు మ్యాచ్‌లలో ఓడింది. కానీ.. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడున్న జట్టు వేరు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజ్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేదనే విమర్శ ఉంది. వాటిని పరిగణంలోకి తీసుకుంటూ.. ఈ సీజన్‌లో ముంబై వైఫల్యానికి గల ఐదు కారణాలను పరిశీలిద్దాం..
ఇషాన్ కిషన్ కోసం భారీ ధర పెట్టడం..
టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్ కోసం ముంబై ఇండియన్స్ వాళ్ల చరిత్రలోనే లేని విధంగా ఏకంగా రూ.15 కోట్లకు పైగా ధర పెట్టి కొనుగోలు చేశారు. ఐపీఎల్ ప్రారంభం అయినప్పటి నుంచి ముంబై ఇండియన్స్ ఏ ఆటగాడిని కూడా రూ.10 కోట్లకు మించి ధర పెట్టి కొనలేదు. కానీ.. గతంలో ముంబైకే ఆడిన ఇషాన్‌ను రిటేన్ చేసుకోకుండా వేలంలో మాత్రం అతని కోసం కోట్లు కుమ్మరించారు. జట్టుకు అంత ముఖ్యమైన ఆటగాడని భావించి ఉంటే ముందే రిటేన్ చేసుకోవాల్సింది. కానీ అలా చేయలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ, పొలార్డ్, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌ను రిటేన్ చేసుకున్నారు. ఇషాన్, క్వింటన్ డికాక్‌ను రిలీవ్ చేశాడు. ఇషాన్ కిషన్ బదులు క్వింటన్ డికాక్‌ను కొని ఉంటే ముంబై వద్ద ఇంకో రూ.9 కోట్లు సేవ్ అయ్యేవి. దాంతో మరో మంచి ప్లేయర్‌ను కొనుగోలు చేసే అవకాశం ఉండేది. డికాక్‌ను రూ.6.75 కోట్లకు లక్నో దక్కించుకుంది. నిజానికి ఇషాన్-రోహిత్ ఓపెనింగ్ జోడీ కంటే కూడా డికాక్, రోహిత్ మంచి ఓపెనింగ్ జోడి అయ్యేవారు ముంబైకి. బ్యాటర్ కమ్ కీపర్‌గా డికాక్ ముంబైకి సేవలందించేవాడు. కానీ.. ఈ విషయంలో ముంబై ఎత్తుగడ విఫలం అయింది.
హార్థిక్ పాండ్యాను వదిలేయడం..
మరో టీమిండియా క్రికెటర్ హార్థిక్ పాండ్యా గతంలో ముంబై ఇండియన్స్‌కే ఆడేవాడు. కానీ.. ఈ సీజన్‌కు ముందు పాండ్యాను ముంబై రిటేన్ చేసుకోలేదు. ఆ సమయంలో పాండ్యా టీమిండియా స్థానంలో కోల్పోవడం, ఫామ్‌లో లేకపోవడం, గాయంతో ఉండడంతో అతనిపై ముంబై నమ్మకం ఉంచలేకపోయింది. కానీ.. ముంబై రిటేన్ చేసుకుంటా అంటే.. పాండ్యా గుజరాత్‌కు వెళ్లే వాడు కాదు. కానీ.. ముంబై వదిలేయడంతో అతను ఏకంగా ఒక కొత్త టీమ్‌కు కెప్టెన్ అయ్యి.. అద్భుతంగా రాణిస్తున్నాడు. ముంబైలో హార్థిక్ పాండ్యా లోటు భర్తీ చేసే ప్లేయర్ లేకపోవడం ఆ జట్టు వైఫల్యాలకు ఒక కారణం.
వేలంలో మళ్లీ బౌల్ట్‌ను కొనకపోవడం..
గతంలో ముంబై ఇండియన్స్‌కు ఆడిన న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై రిలీవ్ చేసినా.. వేలంలో మళ్లీ దక్కించుకుంటుందని అంతా భావించారు. ఎందుకంటే ముంబై తరపున బౌల్ట్ చాలా కన్సిస్‌స్టెంట్‌గా పర్ఫామ్ చేశాడు. కానీ.. అతని స్థానంలో ముంబై.. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను కొనుగోలు చేసింది. దురదృష్టం కొద్ది గాయం కారణంగా అతను లీగ్‌కు దూరమయ్యాడు. ముంబై వదిలేసిన బౌల్ట్‌ను రాజస్థాన్ రాయల్స్ ఆర్చర్ స్థానంలో దక్కించుకుంది. అతను కూడా రాజస్థాన్ తరపున బాగా రాణిస్తున్నాడు. బుమ్రాకు తోడు మరో వికెట్ టేకర్ ముంబైకు లేకపోవడంతో.. బుమ్రాను వదిలి మిగతా బౌలర్లను ప్రత్యర్థి బ్యాటర్లు టార్గెట్ చేసి మరీ కొడుతున్నారు. డేనియల్ సామ్స్, మిల్నేలు ఇప్పటికే తేలిపోయారు.
నాణ్యమైన స్పిన్నర్ లేకపోవడం..
ముంబై ఇండియన్స్‌లో ప్రధాన లోపం ఒక బిగ్ మ్యాచ్ విన్నింగ్ స్పిన్నర్ లేకపోవడం. గత సీజన్లలో రాహుల్ చాహర్, హర్భజన్ సింగ్ లాంటి స్పిన్నర్లు ఉండేవారు. రాహుల్ చాహర్ పొదుపు బౌలింగ్ ముంబైకు ఎంతో ఉపయోగపడేది. ఇప్పుడు ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ముంబైలోని పిచ్‌లు స్పిన్‌కు అనుకూలిస్తున్నాయి. మురగన్ అశ్విన్ ఉన్నా.. కూడా అంతగా ప్రభావం చూపడంలేదు. గతంలో ముంబైకు ఆడిన యుజ్వేంద్ర చాహల్‌ను ఈ సారి ముంబై కొనుగోలు చేస్తుందని అంతా భావించారు. కానీ అది జరగలేదు. అశ్విన్, కుల్దీప్ యాదవ్‌లో ఒకరిని ముంబై తీసుకోని ఉంటే బాగుండేది. ఈ సీజన్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న జట్లు గుజరాత్ టైటాన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉండడం ఒక ప్రధాన బలం. గుజరాత్‌లో రషీద్ ఖాన్, కేకేఆర్‌లో నరైన్, వరుణ్ చక్రవర్తి, రాజస్థాన్‌లో చాహల్, అశ్విన్.
టీమ్ కూర్పు, కెప్టెన్‌గా, ప్లేయర్‌గా రోహిత్ డల్ అవ్వడం..
ఈ సీజన్‌లో ముంబై జట్టు కూర్పు ఒక ఛాంపియన్ జట్టులా లేదనేది కాదనలేని సత్యం. ఆ విషయం ముంబై ఆడిన ఐదు మ్యాచ్‌లు చూస్తే సగటు క్రికెట్ అభిమానికి కూడా అర్థం అవుతుంది. మరీ ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ, బౌలర్లు. ఐదో బౌలర్‌ను ప్రయోగించే విషయంలో సరైన ఆప్షన్ దొరక్క కెప్టెన్ రోహిత్ శర్మ సతమతమవుతున్నాడు. అందుకే ఆ జట్టుపై రెండు సార్లు స్లో ఓవర్ రేట్ జరిమానా పడింది. ఇక కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. బౌలింగ్‌లో మార్పులు కూడా గతంలోలా చేయలేకపోతున్నాడు. అలాగే ఒక స్ట్రాంగ్ బ్యాట్స్‌మెన్‌గా ఉన్న రోహిత్ శర్మ స్థాయికి తగ్గ ప్రదర్శన ఈ సీజన్‌లో ఇప్పటి వరకు చేయలేదు. కెప్టెన్సీ ఒత్తిడి స్పష్టంగా కనిపిస్తుందని క్రికెట్ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఒక బలమైన జట్టును నడిపించడం తేలికే.. కానీ ఉన్న ఆటగాళ్లలోని ది బెస్ట్‌ను బయటికి తీసి జట్టును విజయవంతంగా నడిపించడం అంత తేలికైన విషయం కాదని.. అది రోహిత్‌కు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుందని క్రికెట్ వ్యాఖ్యతలు అంటున్నారు. రోహిత్ తనదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించగలడు. కానీ.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు అలాంటి విశ్వరూపం చూపించలేదు. మరి ముంబై గెలుపుబాట పట్టాలంటే కచ్చితంగా ఈ లోపాలను దాటేసి.. ఉన్న టీమ్‌తోనే అద్భుతం చేయాలి. మరి ముంబై వరుస ఓటములపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బట్లర్‌ను చూసి నేర్చుకోవాలి: యువరాజ్ సింగ్
Words from our captain after #MIvPBKS.#OneFamily #DilKholKe #MumbaiIndians @ImRo45 pic.twitter.com/HLsInEAJLM
— Mumbai Indians (@mipaltan) April 13, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.