అదరగొట్టిన క్రిస్‌ మోరిస్.. 24 బంతుల్లో 50 పరుగులు.. బ్యాటింగ్‌ లో అయితే బావుండేది అంటూ సెటైర్లు..

RCB

ఐపీఎల్‌ 2021 సెకండాఫ్‌ ప్రతి మ్యాచ్‌ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. రాజస్థాన్‌ రాయల్స్‌పై 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 14 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ బౌలర్లు రాజస్థాన్‌ను బాగానే కట్టడి చేశారు. కేవలం 149 పరుగులకే రాయల్స్‌ను పరిమితం చేశారు. హర్షల్‌ పటేల్‌ 3 వికెట్లతో మెరిశాడు. చాహల్‌, అహ్మద్‌ చెరో 2 వికెట్లు తీశారు. ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ(25), దేవ్‌దత్‌ పడిక్కల్‌(22) తడబడినా.. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్‌(30 బంతుల్లో 50 నాటౌట్‌), కేఎస్‌ భరత్‌(35 బంతుల్లో 44 పరుగులు) రాణించారు. వెరసి ఆర్సీబీకి విజయం లాంఛనమైంది. ఆర్సీబీ ముందు రాజస్థాన్‌ బౌలర్లు తేలిపోయారు.

RCBక్రిస్‌ హాఫ్‌ సెంచరీ!

రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ ఆర్సీబీ మ్యాచ్‌లో అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. సోషల్‌ మీడియా వేదికగా అతనిపై అభిమానులు తమదైనశైలిలో సెటైర్లు విసురుతున్నారు. మీమ్స్‌ చేస్తూ ఆడుకుంటున్నారు. ఆర్సీబీపై క్రిస్‌ మోరిస్‌ 11 బంతుల్లో 14 పరుగులు చేసి పడిక్కల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవెలియన్‌ చేరాడు. తర్వాత బౌలింగ్‌ చేసిన మోరిస్‌ ఏకంగా 24 బంతుల్లో 50 పరుగులు ఇచ్చాడు. 12.50 ఎకానమీతో 50 పరుగులు ఇచ్చే సరికి అందరూ మోరిస్‌పై గుర్రుగా ఉన్నారు. మోరిస్‌ ప్రదర్శనపై కుమార్‌ సంగక్కర కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘క్రిస్‌ మోరిస్‌కు కూడా తెలుసు అతను రాజస్థాన్‌ జట్టు కోసం ఎంత కష్టపడుతున్నాడనేది. మొదటి ఫేజ్‌లో అతను చాలా మంచి ప్రదర్శన చేశాడు. 4 ఓవర్లలో 50 పరుగులు అంటే చాలా ఒత్తిడి ఉంటుంది’ అంటూ రాజస్థాన్‌ రాయల్స్‌ డైరెక్టర్‌ సంగక్కర చెప్పుకొచ్చాడు. అభిమానులు అయితే ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. మోరిస్‌ ఆర్సీబీ తరఫున ఆడుతున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఒకే బంతికి మ్యాక్స్‌ వెల్‌, క్రిస్‌ మోరిస్‌కు 50 పరుగులు పూర్తయ్యాయని కామెంట్‌ చేస్తున్నారు. క్రిస్‌ మోరిస్‌ను రాజస్థాన్‌ 16.25 కోట్లకు కొనుగోలు చేసిందనే ప్రైస్‌ ట్యాగ్‌ను గుర్తు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు.

క్రిస్‌ మోరిస్‌ను కొనుగోలు చేసి రాజస్థాన్‌ తప్పు చేసిందా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.