భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన రీషెడ్యూల్ టెస్ట్ మ్యాచ్ అనంతరం 'Bazball'(బజ్ బాల్) అనే పదం బాగా వైరల్ అయింది. ఇంగ్లండ్ టెస్టు టీమ్‌కు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెక్కల్లమ్ ఇస్తున్న కోచింగ్ తీరును, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌ల్లో కనబరుస్తున్న దూకుడును ఉద్దేశిస్తూ.. బజ్‌బాల్ స్ట్రాటజీ(బ్రెండన్ మెక్కల్లమ్ స్ట్రాటజీ) అనే పద ప్రయోగం చేశారు. ఆస్ట్రేలియా చేతిలో గత యాషెస్ సిరీస్‌లో చిత్తుగా ఓడిన ఇంగ్లండ్ ఆ తర్వాత మెక్ కల్లమ్ హెడ్ కోచ్‌గా వచ్చిన తర్వాత అద్భుతంగా పుంజుకొంది. టెస్టుల్లో తమ అత్యధిక లక్ష్యం 378 పరుగులు భారత్‌పై ఛేదించి రికార్డు సృష్టించింది. బ్రెండన్ మెక్కల్లమ్ - బెన్‌స్టోక్స్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తోంది. మెక్కల్లమ్ ముద్దుపేరు బజ్. ప్రతి బంతిని బాదాల్సిందే.. పరుగులు చేయడానికి ప్రతి బంతి ఓ అవకాశమే, కేవలం అవుట్ కాకుండా ఉండేందుకు క్రీజులోనే ఉండిపోకూడదనేది అతని సిద్ధాంతం. ఇదే సిద్ధాంతాన్ని ఇంగ్లండ్ జట్టు నూరిపోయడంతోనే ఆ జట్టు టెస్టుల్లో దుమ్మురేపుతోంది. దీంతో అతని కోచింగ్‌ను బజ్‌బాల్ అనే పదంతో పిలవడం మొదలుపెట్టారు. అయితే, ఇలాంటి పదం తన పేరుపైనే వచ్చినప్పటికీ అదంతా సిల్లీ టర్మ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ కొట్టిపడేశాడు. 'బజ్‌బాల్‌పై నాకైతే ఎటువంటి ఐడియా లేదు. అయితే, మా ఆటగాళ్లు (ఇంగ్లాండ్) చాలా బాగా ఆడారు. పాజిటివ్‌గా ముందుడుగు వేస్తే తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. దూకుడుగా ఆడటమే కాకుండా ఏ విధంగా మ్యాచ్‌ను తీసుకెళ్లారనేది చాలా కీలకం. అందుకే ఇలాంటి పదాలను (బజ్‌బాల్) నేను నమ్మను’ అని మెక్కల్లమ్ పేర్కొన్నాడు. ‘జోష్ హేజల్‌వుడ్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమిన్స్ 'బజ్‌బాల్' గురించి చేసిన కామెంట్లను విన్నా. మేం ఆస్ట్రేలియాకు వెళ్లినప్పుడు తప్పకుండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తాం' అని మెక్కల్లమ్ తెలిపాడు. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం తనకు బజ్ బాల్ అంటే ఏంటో తెలియదని చెప్పిన విషయం తెలిసిందే. Plot twist: Brendon McCullum calls Bazball a 'silly term' — ESPNcricinfo (@ESPNcricinfo) July 9, 2022